హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : ప్రతి ఇంటికీ ‘ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ’ అంటూ కాంగ్రెస్ సర్కార్ మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ను ఏర్పాటుచేయాలని, దీని ఆధారంగా దరఖాస్తుదారులకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని సోమవారం రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజిస్టర్లో కుటుంబానికి సంబంధించిన వివరాలు నిక్షిప్తం చేస్తారు. ఇందుకు రేషన్‌కార్డు వివరాలు అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డు నంబర్ ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా పరిగణిస్తారు. వీటి ప్రకారం ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.
ఇందుకోసం మీ-సేవలో ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ పేరుతో కొత్త సేవను ప్రారంభించనున్నది. రేషన్‌కార్డు వివరాలను నమోదు చేస్తారు. కుటుంబ పెద్ద, సభ్యుల పేర్లు, బంధుత్వం, వయసు, పుట్టినరోజు , ఆధార్ నంబర్‌తోపాటు అడ్రస్ ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం మీ-సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ అధికారాన్ని ప్రభుత్వం తహసీల్దార్‌కు అప్పగించింది. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికెట్ జమచేయాల్సిన చోట మీ-సేవ ద్వారా పొందిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను మాత్రమే ప్రామాణికంగా పరిగణించనున్నారు.