India AI Impact Summit | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ని ప్రపంచంలోనే అతి పెద్ద కృత్రిమ మేధ సదస్సుగా చెబుతున్న కేంద్ర సర్కార్.. దాని నిర్వహణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో సరైన సౌకర్యాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తొలిరోజు సందర్శకులు భారీగా రావడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. భారీ క్యూలో జనం అవస్థలు పడ్డారు. సదస్సు నిర్వహణ తీరుపై చాలా మంది స్టార్టప్ ఫౌండర్లు సోషల్‌మీడియాలో అసం తృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రానున్న రోజుల్లో సందర్శకులు కొత్త అనుభవాన్ని చవిచూస్తారని ఆయన అన్నారు.
సదస్సు సజావుగా సాగేందుకు సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమని మంగళవారం సదస్సు జరుగుతున్న భారత్ మండపంలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి చెప్పారు. సోమవారం సదస్సును తిలకించేందుకు ప్రజలు బారులు తీరి నిలబడటం, అస్పష్టమైన ఆదేశాలు, మొబైల్ డాటా కనెక్టివిటీ సమస్యలు వంటి విమర్శలు వెల్లువెత్తాయి. రద్దీ ఎక్కువగా ఉండటంపై ఆన్లైన్లో వస్తున్న విమర్శలకు మంత్రి స్పందిస్తూ తొలిరోజు సదస్సుకు 70,000 మందికిపైగా హాజరయ్యారని, సందర్శకులు, ప్రముఖులు, ప్రదర్శనకారులలో ఉత్సాహం స్పష్టంగా కనిపించిందని తెలిపారు.
నేటి నుంచి ఏఐ సమ్మిట్ ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ సమ్మిట్ ఇదేనని, దీనికి వస్తున్న స్పందన అనూహ్యమని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ఓ వార్ రూం కూడా ఇప్పుడు పనిచేస్తున్నదని ఆయన తెలిపారు. ఎటువంటి సమాచారమున్నా తమకు అందచేయాలని, సూచనలు, సమస్యలు స్వీకరించడానికి తాము సిద్ధమని ఆయన చెప్పారు. తొలి రోజు సదస్సుకు స్టార్టప్ స్థాపకులు, ప్రపంచ టెక్ ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రతినిధులు సహా వేలాదిమంది హాజరయ్యారని ఆయన చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో పొడవైన క్యూలైన్లు, పలుమార్లు సెక్యూరిటీ చెకింగ్లు, ప్రధాని సందర్శనకు ముందు కొన్ని ఎగ్జిబిటర్ స్టాళ్ల తాత్కాలిక తరలింపు వంటివి గందరగోళానికి దారితీసినట్లు మంత్రి తెలిపారు.
కొన్ని వస్తువుల చోరీ జరిగినట్లు ఆన్లైన్లో ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. నియో శాపీన్ సీఈవో ధనంజయ్ యాదవ్ ఎక్స్ వేదికగా వస్తువుల చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోదీ సందర్శన ఉంటే తనిఖీలు చేసి, దిగ్బంధం చేసేందుకు భద్రతా సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకే వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది చెప్పడంతో భద్రతా సిబ్బంది ఇచ్చిన భరోసాతో వస్తువులను అక్కడే వదిలి పెట్టి వెళ్లామని యాదవ్ పేర్కొన్నారు. 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గేట్లు మూసివేశారని, తాము తిరిగివచ్చి చూసేసరికి తమ వస్తువులు మాయమయ్యాయని ఆయన చెప్పారు. విమాన, వసతి, రవాణా ఖర్చులతోపాటు ప్రదర్శనశాలకు సైతం డబ్బులు చెల్లించిన తర్వాత హై సెక్యూరిటీ జోన్లో వస్తువులు మాయమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఏఐ సదస్సుకు హాజరైన స్టార్టప్ ఫౌండర్లనే నిర్వాహకులు దూరం పెట్టారని రెస్కిల్ ఫౌండర్ పునీత్ జైన్ ఎక్స్‌లో ఫిర్యాదు చేశారు. ప్రదర్శకులు, ప్రతినిధులు, స్టార్టప్ ఫౌండర్లను బయటే నిలబెట్టారు. మంచినీరు లేదు. స్పష్టత లేదు. వేడుకలను మీడియా చూపిస్తుంటే వాస్తవ పరిస్థితి గందరగోళం. భారతదేశ ఏఐ భవిష్యత్తు నిర్మాణం ఇలా జరగరాదు అని ఆయన రాసుకొచ్చారు.