సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 02:42:07

విరాట్‌ విజయం చెన్నైపై బెంగళూరు గెలుపు

విరాట్‌ విజయం చెన్నైపై బెంగళూరు గెలుపు

దుబాయ్‌: బ్యాటింగ్‌కు కష్టతరమైన పిచ్‌పై ఓ మోస్తరు స్కోరు చేసిన బెంగళూరు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను నిలువరించింది. ఇక్కడి దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శనివారం ధోనీ సేనతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అండ్‌ కో 37 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (52 బంతుల్లో 90; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. దేవదత్‌ పడిక్కల్‌ (33) ఫర్వాలేదనిపించాడు. చేతిలో వికెట్లు ఉన్నా బ్యాట్స్‌మెన్‌ ధాటిగా ఆడలేక పోవడంతో రాయల్‌ చాలెంజర్స్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఫించ్‌ (2), డివిలియర్స్‌ (0) విఫలమయ్యారు. 16వ ఓవర్లో గానీ మూడంకెల స్కోరు చేరుకోని బెంగళూరు చివర్లో కోహ్లీ విశ్వరూపం చూపడంతో మంచి స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. సునాయాస లక్ష్యఛేదనలో చెన్నై తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. వాట్సన్‌ (14), డుప్లెసిస్‌ (8), ధోనీ (10), సామ్‌ కరన్‌ (0), జడేజా (7), బ్రావో (7) ఎక్కువ సేపు నిలువలేకపోగా.. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు (42), జగదీశన్‌ (33) ఓ మాదిరిగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌ 3, వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

సంక్షిప్త స్కోర్లు

బెంగళూరు: 20 ఓవర్లలో 169/4 (కోహ్లీ 90*, పడిక్కల్‌ 33; శార్దుల్‌ 2/40), 

చెన్నై: 20 ఓవర్లలో 132/8 (రాయుడు 42, జగదీశన్‌ 33; మోరిస్‌ 3/19).