Parental Tips | ఒకప్పుడు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్లు.బడి నుంచి వచ్చాక ఆటపాటల్లో మునిగిపోయేవారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పొద్దున లేచినప్పటి నుంచి సెల్‌ఫోన్‌తోనే సహవాసం చేస్తున్నారు. బడిలో డిజిటల్ పాఠాలు, బడి లేకపోతే ఆన్లైన్ క్లాసులు.. ఇదీ తంతు! ఆటలకూ, కాలక్షేపానికీ.. అన్నిటికీ అదే ఫోన్! కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మితిమీరి వాడటం పిల్లల ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇలాంటి సమయంలో సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు ఫోన్లో పిల్లలు ఏం చేస్తున్నారో కూడా ఓ కన్ను వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే!
మనిషి మనుగడను సరళతరం చేయడంలో భాగంగా రకరకాల సాంకేతిక ఉపకరణాలను సృష్టిస్తున్నారు శాస్త్ర వేత్తలు. అందులో సెల్‌ఫోన్ విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కావాల్సిన సమాచారం వెంటనే దొరుకుతున్నది. నేర్చుకునే సామర్థ్యాలూ పెరుగుతున్నాయి. పిల్లల విషయానికి వస్తే ఫోన్లో ఆటలు వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తున్నాయి. పోటీ తత్వాన్నీ పెంచుతున్నాయి. అయితే, సాంకేతిక పరిజ్ఞానం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది! మంచికి ఉపయోగిస్తే మేలు జరుగుతుంది. చెడుకు వాడితే.. అనర్థాలకు దారితీస్తుంది. సెల్‌ఫోన్ స్మార్ట్‌నెస్ సంతరించుకున్న కొద్దీ భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
డిజిటల్ తరగతుల్లో సైబర్ సేఫ్టీ చాలా ముఖ్యం. విద్యార్థుల వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం వాటిల్లకుండా తగిన రక్షణ విధానాలు పాటించాలి. విద్యార్థులకు ఆన్లైన్ ప్రైవసీ, డేటా సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పించాలి. టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే కాదు, ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో కూడా తెలియజేయాలి. ఇవేవీ పాటించకుండా పిల్లలను సాంకేతికతకు చేరువ చేయడం వల్ల రకరకాల అనర్థాలు తలెత్తుతాయి. అవగాహన లేమితో సోషల్ మీడియా వాడకం ప్రమాదానికి దారితీస్తుంది. తెలిసీ తెలియని వయసులో వ్యక్తిగత వివరాలు ఇతరులకు షేర్ చేసి సమస్యల్లో చిక్కుకుంటున్న పిల్లలు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారు. అసభ్య పదజాలంతో కామెంట్లు చేసి నవ్వుల పాలవుతున్నారు.
Children Online Class
అందరి జీవితాల్లోనూ భాగమైపోయిన ఇంటర్నెట్ నుంచి దూరంగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుతున్నాం అనే దానిపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆన్లైన్ గేమ్స్ పిల్లలకు ఉచ్చులా బిగుస్తున్నాయి. సోషల్ మీడియా టీనేజర్లకు వల విసురుతున్నది. పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించడం వల్ల వాళ్ల సోషల్ మీడియా బిహేవియర్‌ను అంచనా వేయవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో కనిపెట్టాలి. ముఖ్యంగా ఈ విషయాలను పరిశీలించడం మంచిది.
☞ పిల్లలు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో ఓ కంట కనిపెడుతుండాలి.
☞ ఏ ప్లాట్‌ఫామ్‌పై వాళ్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు, ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో చూస్తుండాలి.
☞ మిమ్మల్ని ఎలాంటి విషయాల్లో సలహాలు అడుగుతున్నారు, మీతో ఏయే అభిప్రాయాలు పంచుకుంటున్నారో విశ్లేషించుకోవాలి.
☞ ఇంటర్నెట్లో ఎలాంటి సమాచారం చూస్తున్నారో చెక్ చేయాలి.
☞ స్నేహితులు వారికి ఎలాంటి సందేశాలు పంపుతున్నారో చూడాలి.
పిల్లలను అదేపనిగా అనుమానించాలని చెప్పడం కాదు కానీ, వారి ప్రవర్తనలో అసహజమైన మార్పులు కనిపిస్తే మాత్రం అనుమానించాల్సిందే! ఒంటరిగా గదిలో గంటల తరబడి ఫోన్‌తో గడుపుతుంటే వారించాలి. పేరెంట్స్ వస్తున్నారు అనిపించగానే ల్యాప్‌టాప్ క్లోజ్ చేయడమో, స్క్రీన్ ఆఫ్ చేయడమో, విండో మార్చడమో చేస్తున్నారంటే తేలిగ్గా తీసుకోవద్దు. స్క్రీన్టైమ్ ఎంత ఉండాలో నిర్దేశించి చెప్పాలి. ఆన్లైన్ క్లాసులు లేకపోతే ఫోన్ చూడకుండా కట్టడి చేయండి. స్క్రీన్ టైమ్ ఫిక్స్ చేసి అంతకుమించి ఫోన్, కంప్యూటర్ వాడకుండా చూసుకోవాలి. వీటితోపాటు…
☞ అడల్ట్ కంటెంట్ చూడకుండా పేరెంటల్ కంట్రోల్స్ సెట్ చేసుకోవాలి.
☞ ప్లేస్టోర్ నుంచి అప్లికేషన్లు కొనుగోలు చేయకుండా డిసేబుల్ చేయాలి.
☞ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు వివరాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
☞ సైబర్ బుల్లీయింగ్, ప్రైవసీ అంశాలపై అవగాహన కల్పించాలి. ఫ్యామిలీ మెయిల్ ఐడీ జెనరేట్ చేసి, పిల్లలు దానిని ఉపయోగించేలా చూడాలి. అప్పుడు పిల్లలు ఏ గేమ్ డౌన్లోడ్ చేసినా తల్లిదండ్రులకూ తెలిసిపోతుంది.
☞ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ‘సేఫ్ సెర్చ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. https://www.kiddle.co లింక్ ద్వారా సెర్చ్ చేయడం కూడా మంచిదే.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?