SLW vs BANW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక (Srilanka) ఎట్టకేలకు బోణీ కొట్టింది. స్వదేశంలో వరుణుడి ప్రతాపానికి మ్యాచ్‌లు సాగక సెమీస్ రేసులో వెనకబడిన లంక.. ముంబైలో మురిసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అప్పటిదాకా గొప్పగా పోరాడిన బంగ్లా ప్లేయర్లు.. చివరి ఓవర్లో చేతులెత్తేశారు. వరిదాకా నిలబడి జట్టును గెలిపించాలనుకున్న నిగర్ సుల్తానా (77) సహ నాలుగు వికెట్లు పడడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు.
వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ ఆ తర్వాత నుంచి పరాజయాల బాటలోనే నడుస్తోంది. ఇంగ్లండ్, న్యూజలాండ్పై చివరిదాకా పోరాడి ఓడిన బంగ్లా.. ఈసారి ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో కంగుతిన్నది. సొంతగడ్డపై ఒక్క విజయాన్ని చవిచూడని శ్రీలంక చేతిలో నిగర్ సుల్తానా టీమ్ 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
What a sensational final over by Captain Chamari Athapaththu to win this close game .
WWWW10
WOW…just WOW 😲😳 #slvsban #CWC2025 pic.twitter.com/WDA0JYNLPp
— Sandeep R. Kaushik, PhD (@skaushik2025) October 20, 2025
శ్రీలంక నిర్దేశించిన 203 పరుగుల ఛేదనలో యాభై రన్స్ లోపే మూడు కీలక వికెట్లు పడినా.. బంగ్లాదేశ్ మిడిలార్డర్ అద్బుతంగా పోరాడింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (77 నాటౌట్), షమీన్ అక్తర్(67 రిటైర్డ్ హర్ట్)లు గొప్పగా ఆడినా.. చివరి ఓవర్లో లంక కెప్టెన్ చమరి ఆటపట్టు అద్బుతమే చేసింది. ఇద్దరిని ఎల్బీగా ఔట్ చేసిన తను జట్టును గెలిపించింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. మొదటి బంతికే రబేయా ఖాన్ ఎల్బీగా ఔటయ్యింది. రెండో బంతికి నిహిదా అక్తర్ రనౌట్. మూడో బంతికి సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం మరుఫా అక్తర్ సైతం ఎల్బీగా ఔట్ కావడంతో లంక విబిరంలో సంబురాలు మొదలయ్యాయి. దాంతో.. మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు పాయింట్ల ఖాతా తెరిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు విఫలమైనవేళ.. కెప్టెన్ చమరి ఆటపట్టు(46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. పవర్ ప్లేలో హాసిని పెరీరా(85)తో కలిసి స్కోర్ 60 దాటించింది. అయితే.. ఆటపట్టును ఔట్ చేసిన రబేయా ఖాన్ బంగ్లాకు బ్రేకిచ్చింది. అయినా.. నీలాక్షి డిసిల్వా(37) సాయంతో స్కోర్ బోర్డును ఉరికించింది పెరీరా. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్ని స్కోర్ 170 దాటించారు.
Sri Lanka’s Hasini Perera and Bangladesh’s Shorna Akter are star performers for their respective sides. pic.twitter.com/8mmOPuqRoI
— CricTracker (@Cricketracker) October 20, 2025
అక్కడి నుంచి వికెట్ల వేటకు తెరతీసింది షోర్నా అక్తర్(3-27). సంచలన బౌలింగ్ చేసిన తను.. డిసిల్వాను ఎల్బీగా ఔట్ చేసింది. ఆ తర్వాత.. సంజీవని(2)ని డగౌట్ చేర్చింది. దాంతో.. 174-4తో పటిష్ట స్థితిలో ఉన్న లంక షోర్నా తిప్పేయడంతో ఆలౌట్ ప్రమాదంలో పడింది. తొమ్మిదో వికెట్‌కు 18 రన్స్ జోడించి లంక స్కోర్ 200లు దాటించిన ప్రబోధినిని రబేయా ఔట్ చేయగా.. మల్కీ మదర రనౌటయ్యింది. దాంతో.. 202 పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.