Waiel Awwad : ఈ ప్రపంచంలో ఎవరైతే నాయకులను చంపుతారో వాళ్లే ఉత్తములని మధ్యప్రాచ్య వ్యవహారాల్లో నిపుణుడు అయిన వాయెల్ అవాద్ అన్నారు. ఈ తరహా హత్యలు ఇప్పుడు జరుగుతున్నాయి, గతంలో జరిగాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా వాళ్లను కూడా టార్గెట్ చేస్తామని తాజాగా ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో అవాద్ ఈ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ కుమారుడు మొజ్తాబా హుసేనీ ఖమేనీ కొత్త సుప్రీంలీడర్‌గా ఎన్నిక కావడంపై వాయెల్ అవాద్ స్పందించారు. ఖమేనీ మరణించకముందే తన వారసులుగా ముగ్గురి పేర్లను ప్రకటించారని, కానీ వాళ్లలో ఆయన కుమారుడు లేడని చెప్పారు. అయితే ఖమేనీ హత్య అనంతరం ఆయన కుమారుడిపై ప్రజల్లో సింపతీ ఏర్పడిందని అన్నారు. అంతే తప్ప సుప్రీం లీడర్ కుమారుడిని సుప్రీం లీడర్‌ను చేయాలనేది ఇరాన్ సంప్రదాయం కాదని అన్నారు. ఇదిలావుంటే ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా వారు తమ లక్ష్యంగా మారుతారని ఇజ్రాయెల్ హెచ్చరించిందని చెప్పారు.
ఈ హెచ్చరికలను ఇజ్రాయెల్ బహిరంగంగా చేస్తోందని వాయెల్ అవాద్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అది వాళ్ల స్టైల్ అని వ్యంగ్యంగా అన్నారు. ఈ రోజుల్లో నాయకులను హత్యలు చేసేవాళ్లే ఈ ప్రపంచంలో ఉత్తములు అవుతున్నారని ఎద్దేవా చేశారు.