Govardhan Asrani | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. సీనియర్ నటుడు, కమెడియన్ గోవింద్ అస్రాని (84) తుదిశ్వాస విడిచారు. షోలో చిత్రంలో జైలర్ పాత్రతో గుర్తింపు పొందిన నటుడు సోమవారం కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా ముంబయిలోని ఆరోగ్య నిధి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన మధ్యాహ్నం 3 గంటలకు కన్నుమూశారు. అయితే, మరణానానికి కారణాలు తెలియరాలేదు. ఈ రోజు సాయంత్రమే ఆయన అంత్యక్రియలు సైతం నిర్వహించినట్లు మేనేజర్ మీడియాకు తెలిపారు. అస్రానీ అంత్యక్రియలు శాంతాక్రూజ్ వెస్ట్‌లోని శాస్త్రి నగర్ శ్మశానవాటికలో జరగ్గా.. సినీ ప్రముఖులు ఎవరూ రాలేదు. వాస్తవానికి ఈ ఉదయం అస్రాని తన భార్య మంజుతో కలిసి మాట్లాడిన సందర్భంలో తన అంత్యక్రియలకు ఎవరూ రాకూడదని.. ప్రజలను ఇబ్బందిపెట్టకూడదని.. ప్రశాంతంగా వెళ్లిపోవాలనుకుంటున్నానని చెప్పారని సమాచారం. దాంతో ఆయన భార్య మంజు అస్రానీ ఈ విషయంపై ఎవరికీ సమాచారం ఇవ్వలేదు.
గోవింద్ అస్రానీ చదువు పూర్తయ్యాక 1960 నుంచి 1962 వరకు సాహిత్య కల్భాయ్ ఠక్కర్ నుంచి నటనలో శిక్షణ తీసుకున్నారు. 1962లో ఉద్యోగం కోసం ముంబయికి చేరుకున్నారు. 1963లో అస్రానీ కిశోర్ సాహు, హృషికేష్ ముఖర్జీని కలిశాడు. ఆయన అస్రానీని వృత్తిపరంగా నటన నేర్చుకోమని సలహా ఇచ్చారు. 1964లో అస్రానీ పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందారు. అస్రానీ ‘హరే కాంచ్ కి చురియాన్’ చిత్రంలో తన తొలి అవకాశాన్ని పొందాడు. ఈ చిత్రంలో నటుడు బిశ్వజిత్ స్నేహితుడి పాత్రలో కనిపించారు. తన తొలి సినిమాలో నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న అస్రానీ.. 1967లో ఒక గుజరాతీ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత మరో 4 గుజరాతీ చిత్రాల్లో కనిపించారు. 1971 సంవత్సరం తర్వాత.. అస్రానీ సినిమాల్లో కమెడియన్‌గా.. నటుడి స్నేహితుడి పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు.
1970 నుంచి 1979 వరకు ఆయన 101 చిత్రాలలో నటించారు. ‘నమక్ హరామ్’ చిత్రంలో నటించిన తర్వాత, అస్రానీ, రాజేష్ ఖన్నా స్నేహితులయ్యారు. అనంతరం రాజేష్ ఖన్నా ఏ చిత్రంలో నటించినా, అస్రానీకి కూడా తీసుకోవాలని నిర్మాతలను కోరేవారు. అస్రానీ, రాజేష్ ఖన్నాతో కలిసి 25 చిత్రాలలో నటించారు. 1970లో అస్రానీ అనేక చిత్రాలలో హాస్యనటుడిగా నటించారు. వీటిలో షోలే, చుప్కే చుప్కే, ఛోటీ సి బాత్, రఫూ చక్కర్, ఫకీరా, హీరా లాల్ పన్నాలాల్, పతి పత్నీ ఔర్ వో మూవీలు ఉన్నాయి. అనేక చిత్రాలలో హాస్యనటుడి పాత్ర పోషించిన అస్రానీ ‘ఖూన్ పసినా’లో కూడా సీరియస్ పాత్ర పోషించారు. 2000 సంవత్సరాల్లోనూ పలు చిత్రాల్లో కమెడియన్‌గా మెరిశారు. ఇందులో చుప్ చుప్ కే, హేరా ఫేరీ, హల్చల్, దీవానే హ్యూ పాగల్, గరం మసాలా, భాగమ్ భాగ్, మలమాల్ వీక్లీ ఉన్నాయి.