KTR | సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో బీఆర్ఎస్ నేతలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సున్నం చెరువు బాధిత కుటుంబాల పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి, వారి కడుపు కొట్టి ఇండ్లను కూల్చారని, నగరంలో పేదలు గూడు చెదిరి పోయిన పక్షులలాగా అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి పేదలపై దౌర్జన్యం చేశారన్న ఆయన మాకు స్థలం పేపర్లు ఉన్నాయన్న పట్టించుకోలేదని, కనీసం చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఇంతకన్న దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నించారు.
పేదలకు న్యాయం చేయాలని, కేసీఆర్ కట్టించిన లక్ష ఇండ్లలో ఇంకా 40 వేల ఇండ్లు మిగిలి ఉన్నాయన్న కేటీఆర్ వెంటనే వాటిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతలలో ఇండ్లు కోల్పోపోయిన బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం సర్కార్ కొత్తగా ఒక్క ఇల్లు కట్టింది లేదు.. ఒక్క ఇటుక పెట్టలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నగరంలో పేదలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిని సరఫరా చేస్తే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నల్లా నీళ్లు రావడం లేదన్నారు. ఇంకో రెండేళ్లలో వచ్చేది బీఆర్ ఎస్ ప్రభుత్వమేనని, మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సున్నం చెరువుతో పాటు హైడ్రా వల్ల నష్టపోయిన ప్రతీ ఒక్కరి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు ఉన్నాయని అందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నరకాసుర ప్రభుత్వం పోయాక దీపావళి వేడుకలను పెద్దగా జరుపుకుందామని, పేదల కన్నీళ్లల్లో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. పేదలకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రా బాధితులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే శంభీపూర్ రాజు, అల్లపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కొమిరిశెట్టి సాయిబాబా, రంగారావు, మారబోయిన రవి యాదవ్ పాల్గొన్నారు.