న్యూఢిల్లీ: దంత సమస్యలతో బాధపడే రోగులకు కొన్ని గంటల్లోనే శాశ్వత డెంటల్ క్రౌన్స్(దంతం లాంటి టోపి)ను అమర్చే అవకాశాలు రాబోతున్నాయి. టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. శాశ్వత డెంటల్ వర్క్‌కు గోల్డ్ స్టాండర్డ్ మెటీరియల్ అయిన జిర్కోనియాతో 3డీ ప్రింటెడ్ డెంటల్ రిస్టోరేషన్స్ను తయారు చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనివల్ల వేగంగా, వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా, రోగులకు సదుపాయంగా ఉండే విధంగా డెంటల్ క్రౌన్స్, బ్రిడ్జెస్, వెనీర్స్, ఇతర రిస్టోరేషన్స్ను తయారు చేయడం సాధ్యమవుతుంది.
3డీ ప్రింటింగ్ జిర్కోనియా తయారీ ప్రక్రియలో అడ్డంకులను టెక్సాస్ విశ్వవిద్యాలయం, డల్లాస్ పరిశోధకులు పరిష్కరించారు. సాధారణంగా క్రౌన్స్ ప్రింటింగ్ తర్వాత డీబైండింగ్ జరగాలి. ఈ ప్రక్రియలో జిర్కోనియా కణాలకు ఉండే రెసిన్‌ను తొలగిస్తారు. అనంతరం కణాలను ఘన నిర్మాణంగా మార్చే సింటరింగ్ చేయాలి. సాధారణంగా డీబైండింగ్కు 20 నుంచి 100 గంటలు పడుతుంది.
మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ మజీద్ మినరీ మాట్లాడుతూ తాము ఈ డీబైండింగ్ సమయాన్ని 30 నిమిషాల కన్నా తక్కువకు తగ్గించగలిగామని చెప్పారు. దీనివల్ల క్రౌన్ పగిలిపోకుండా రెసిన్ నుంచి విడుదలైన గ్యాస్ బయటికి పోతుందన్నారు. దీనివల్ల వృథా తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి, డెంటిస్టులు అదే రోజు పర్మనెంట్ రిస్టోరేషన్స్ చేయడానికి వీలవుతుంది.