Iranian strikes : ఇరాన్ (Iran) కు.. ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) బలగాలకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై విరుచుకుపడుతుండటంతో.. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒమన్ తీరం (Oman Coast) లోని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు (Indian seafarers) మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.
ఒమన్ (Oman) తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు అడ్వయిజరీ జారీచేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ (Gulf of Oman), హార్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొన్నది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని తెలిపింది.
షిప్ ఆపరేటర్ల భద్రతను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది. తాజా నివేదికల ప్రకారమైతే భారత జెండా ఉన్న నౌకలను నిలిపివేసినట్లు ఎలాంటి సమాచారం రాలేదని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రక్షించిన సిబ్బందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
పర్షియన్ గల్ఫ్ సమీపంలో చిక్కుకొన్న భారతీయ నావికులకు తక్షణ సాయం అందించడానికి, వారిని భారత్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యుద్ధంవల్ల ప్రభావితులైన భారత నావికులతో ఈ బృందంలోని అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతారన్నారు. నావికుల కుటుంబాలు, షిప్పింగ్ కంపెనీలు, ట్రేడ్ యూనియన్లు, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్లు, సంబంధిత పోర్ట్ అధికారులతోనూ ఈ బృందం సమన్వయం చేసుకుంటుందని చెప్పారు.