హైదరాబాద్: నీట్ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ముమ్మాటికీ విద్యార్థుల ఆగ్రహానికి ప్రతీక అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతు అణచివేయాలని చూసిన ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ పరిణామం చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల చారిత్రాత్మక విజయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిశోర్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ గత నెల రోజులుగా విద్యార్థులు సాగిస్తున్న న్యాయమైన పోరాటాన్ని అసాంఘిక శక్తుల కుట్రగా అభివర్ణిస్తూ, వారిని ఎగతాళి చేసి మాట్లాడిన బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కేంద్ర మంత్రితో ఎందుకు రాజీనామా చేయించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువశక్తి ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదనే విషయం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ తెలిపారు.
యువత పోరాట ఫలితంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని, ఇది దేశ భవిష్యత్తుకు మంచి పరిణామమని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ఒక మంత్రి పదవి నిష్రమణ కాదని, ఇది దేశ విద్యార్థులు, యువత సాధించిన చారిత్రక విజయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారామ్‌యాదవ్ పేర్కొన్నారు. నీట్లో అవకతవకలపై స్పందించిన కేంద్రం ప్రభుత్వం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం, విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు అమోదం తెలుపడం, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపునకు, విద్యావ్యవస్థ ప్రక్షాళనకు అంగీకరించడం యువత విజయమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేరొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య బాధ్యతకు దకిన విజయమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత, విద్యార్థులు సాధించిన విజయంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ కొనియాడారు.
విద్యార్థుల ఉద్యమంతోనే కేంద్రం వెనక్కి : జోగు రామన్న
కేంద్ర ప్రభుత్వం వరుసగా తప్పిదాలు చేస్తూ, తర్వాత ప్రజల ఒత్తిడికి తలొగ్గడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను ప్రజల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనకి తీసుకోవాల్సి వచ్చినట్టే, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలోనూ విద్యార్థుల ఉద్యమం ఫలితంగా కేంద్రం వెనకి తగ్గాల్సి వచ్చిందని పేరొన్నారు. యువత ఐక్యంగా పోరాడితే ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో యువతకు హామీలు ఇచ్చి, ఎన్నికల అనంతరం వాటిని విస్మరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఆదిలాబాద్ సీసీఐ పునఃప్రారంభమైతే స్థానిక యువతకు భారీస్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సీసీఐ సాధనలో కలిసిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.
విద్యార్థుల ఉద్యమ విజయం : కూనంనేని
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమ విజయంగా ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజీనామాతోపాటు విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 27న తలపెట్టిన లోక్‌భవన్ ముట్టడితోపాటు అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులపై పాశవికంగా లాఠీచార్జీకి తెగబడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్‌ను రద్దు చేసి ఆయా రాష్ర్టాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.
నిరంకుశ పాలనపై విజయం : జాన్‌వెస్లీ
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మోదీ నిరంకుశ పాలనపై దేశ యువత, విద్యార్థులు సాధించిన విజయంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అభివర్ణించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లీకేజీ వ్యవహారంలో కేంద్రం ఉదాసీనతతో 24లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తంచేశారు. 22 మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేసుకున్నారని విచారం వ్యక్తంచేశారు. దేశం, ప్రజాస్వామ్యం హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న యువత నేడు దేశానికి ఆశాకిరణంలా మారుతున్నదని పేర్కొన్నారు.
విద్యార్థుల విజయం : మాజీ ఎమ్మెల్యే మర్రి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయమేనని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతటివారైనా ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పదని తెలిపారు. విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించడం ప్రతి భారతీయుడిని కదిలించిందని, అందుకే యావత్ దేశం మోదీ ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వచ్చిందని, దీంతో కేంద్ర మంత్రి ధర్రేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదే రాజీనామా నెలరోజుల ముందే చేసి ఉంటే మోదీ ప్రతిష్ఠ పెరిగేదని అభిప్రాయపడ్డారు.
రాజీనామాతో బాధ్యత ముగియదు : చంద్రావతి
నీట్ లీకేజీపై కేవలం రాజీనామాతో బాధ్యత ముగియదని, పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సంస్కరణలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆమె ఒక ప్రకటనలో స్పందిస్తూ.. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కీలకమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణమైన చర్య అని అభివర్ణించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో లోపాలు పునరావృతం కాకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని చంద్రావతి కోరారు.