జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(Lovely Professional University)లో సెప్టెంబర్ 27, 28వ తేదీన విధ్వంసం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వర్సిటీకి చెందిన ఓ అమ్మాయిని బయటి వ్యక్తులు రేప్ చేశారన్న ఆరోపణలపై అక్కడ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్‌లో ఉన్న ఓ యుద్ధ ట్యాంకర్‌తో పాటు మిగ్-23 యుద్ధ విమానంపైకి విద్యార్థులు ఎక్కి నిరసన చేపట్టారు. అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది.
అత్యాచారానికి పాల్పడిన బయటి వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ విద్యార్థులు భారీ విధ్వంసాన్ని సృష్టించారు. వర్సిటీలో ఉన్న ఫర్నీచర్, వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఆ సమయంలో మిగ్-23పైకి ఓ బాలుడు ఎక్కాడు. ఆ ఫోటో, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ కేసులో ఆ చిన్నారిని అరెస్టు చేసినట్లు జలంధర్ పోలీసులు చెప్పారు. ఆ కుర్రాడు హిమాచల్ ప్రదేశ్‌లోని మండీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఎల్పీయూ విధ్వంసం కేసులో అరెస్టు అయిన వారిలో వర్సిటీ విద్యార్థులు ఏమ్స్ దహియా, ఆశుతోష్, అంత్రిక్ష దత్, సాహిల్ సింగ్, కృష్ణ కుమార్, భవిష్య కరణ్ ఉన్నారు. పిజా డెలివరీ బాయ్స్ గగన్‌దీప్, జస్మీత్ కుమార్ కూడా అరెస్టు అయినవారిలో ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీలో జరిగని విధ్వంసానికి కారణమైన 40 మందిని గుర్తించారు. దాంట్లో బీబీఏ విద్యార్థి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఫర్హత్ దేవ్ ఉన్నాడు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 21 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిరసన సమయంలో ఫర్హత్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.
అత్యాచారానికి గురైన బాధితురాలిని ఇంకా గుర్తించలేదని జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. వర్సిటీ స్టాఫ్, స్టూడెంట్స్, వార్డెన్లు.. అందర్నీ ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. లవ్లీ వర్సిటీపై వ్యూహాత్మకంగా దాడి చేశారా అన్న కోణంలోనూ విచారణ చేపడుతున్నట్లు డీఐజీ తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చి, విద్యార్థులను రెచ్చగొట్టి, ప్రజా ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన వారి కోసం అన్వేషిస్తున్నట్లు పాటియాలా ఎస్ఎస్పీ హర్మన్దీప్ సింగ్ తెలిపారు.