ఖమ్మం, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ.. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కొన్ని ఐఐటీ, మెడికల్ అకాడమీలు నిర్వహణ సాగిస్తున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒకచోట తరగతులు బోధిస్తూ.. మరోచోట ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల ద్వారా ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం విద్యార్థి ఏ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందితే అక్కడే హాజరు, అకడమిక్ పరీక్షలకు అనుగుణంగా చదువు కొనసాగించాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా కొన్ని జూనియర్ కళాశాలలు, అకాడమీలు వ్యవహరిస్తున్నాయి.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ అను మతులు పొందిన జూనియర్ కళాశాలల్లో ఉండాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో మాత్రం కొన్ని కళాశాలల్లో రెగ్యులర్ విద్యార్థులు కొందరు ఉండగా మరికొందరు మాత్రం ఆయా కళాశాలలో ఎప్పుడూ కనిపించరు. కనిపించని విద్యార్థులంతా ఇతర -కాడమీల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తుంటారు. ఐఐటీ, జేఈఈ, మెడికల్ అకాడమీల పేరుతో ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు నీట్ వంటి వైద్య ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామంటున్న నిర్వాహకులు ఇంటర్ విద్యనే బోధి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యా ర్థులు లాంగ్ టర్మ్ అకాడమీల్లో శిక్షణ పొందొచ్చు. కానీ, రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం అకాడమీల్లో ఉండ టంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ అకాడమీల్లో ఇంటర్ విద్యను ఎందుకు బోధిస్తున్నారనే దానిపై కనీసం ఇంటర్మీడియట్ విద్యాధికా రులు ప్రశ్నించడం లేదు.
ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వహణను నిబంధనల మేరకు పర్యవేక్షించాల్సిన అధికారులు మెడికల్ అకాడమీల వ్యవహారంపై దృష్టి సారించకపోవడంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అసం తృప్తి వ్యక్తమవుతున్నది. ఒక విద్యార్థి తాను అడ్మిషన్ పొందిన చోటకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అకాడ మీలో ఉంటే వాటిపై చర్యలకు జిల్లా ఇంటర్ విద్యాశా ఖాధికారి సిఫారసు చేయవచ్చు.. కానీ ఆ దిశగా ఇప్పటివరకు జిల్లాల్లో ఎలాంటి చర్యలు లేవు. మెడికల్ అకాడమీల్లో ఉన్న విద్యార్థులు అడ్మిషన్ పొందారు..? తనిఖీలు చేస్తే వెల్లడవుతాయని విద్యావే త్తలు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశంలో పారదర్శకత లేకపోతే చివరికి నష్ట పోయేది విద్యార్థులేనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. విద్యార్థులను తప్పుదారి పట్టించే విధానాలకు అడ్డుకట్ట వేయాలని, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఖమ్మంజిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా అకాడమీలు పుట్టుకొ చ్చాయి. రోటరీనగర్, మమత రోడ్డు, బల్లేపల్లి వంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఈ రెండు సంవత్సరాల్లో భారీగా వెలిశాయి. చిన్నచిన్న బిల్డింగుల నుంచి లక్ష ఎస్ఎఫ్ఎ ఉన్న బిల్డింగ్ కూడా ఇటువంటి అకాడమీలు నిర్వహణ సాగిస్తున్నాయి. వీటిపై విద్యార్థి సంఘాలు పలు ధపాలుగా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. కఠినచర్యలకు ఉపక్రమించా ల్సిన యంత్రాంగం వీటి పట్ల కనీస చర్యలు కూడా తీసుకోవట్లేదనే ఆరోపణలున్నాయి.
విద్యాసంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ఐఐటీ, మెడికల్ అకాడమీల్లో ఇంటర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు తీసు కుంటాం. ఇంటర్ విద్యార్థులు జూనియర్ కళాశాలల్లో తరగతులకు హాజరుకావాలి. తల్లిదండ్రులు అలాంటి అకాడమీల్లో విద్యార్థులను చేర్పించి మోసపోవద్దు. అకా డమీలకు ఇంటర్ బోర్డు అనుమతులు లేవు.
– కె. రవిబాబు, డీఐఈవో