హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై సమాచారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కాల్ సెంటర్‌ను హౌసింగ్ బోర్డు కార్యాలయంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లిశ్, ఉర్దూ భాషల్లో సమాచారం తెలియజేస్తామని పొంగులేటి వెల్లడించారు.