న్యూఢిల్లీ/ముంబై, అక్టోబర్ 2: టాటా ట్రస్ట్స్-టాటా సన్స్ మధ్య వివాదం తారస్థాయికి చేరుకున్నది. టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకంతో రాజుకున్న ఈ రగడ.. రోజుకో మలుపు తిరుగుతూ మరింతగా పెరుగుతున్నది. చివరికి కోర్టులదాకా చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇద్దరు సీనియర్ ట్రస్టీలు.. ఏకంగా టాటా ట్రస్ట్స్‌పై నమ్మకమే పోయిందన్నట్టుగా అసంతృప్తిని వ్యక్తం చేయడం మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు.
టాటా సన్స్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయడానికి ససేమిరా అంటున్న టాటా ట్రస్ట్స్.. దాన్ని తప్పించడానికి గ్రూప్ సంస్థలైన టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్‌ను టాటా సన్స్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న సర్ దోరాబ్జి టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ)కు చెందిన ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు.. ఈ ప్రతిపాదనపై ఒకింత ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఎస్‌డీటీటీ మిగతా ట్రస్టీలకు ఈ ఇరువురు ఓ సంయుక్త లేఖను రాశారు. అందులో ఈ అసమ్మతి ట్రస్టీలు.. సదరు ప్రతిపాదనకున్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూనే ఆర్థిక, పాలనాపరమైన చిక్కులపట్ల ఆందోళన వెలిబుచ్చారు. తమను సంప్రదించకుండానే టాటా సన్స్ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం తీసుకున్నారని ఎస్‌డీటీటీ వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్‌తోపాటు, విజయ్ సింగ్ ఆక్షేపించారు. తమకూ పత్రికా ప్రకటనల ద్వారానే విషయం తెలిసిందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంపెనీలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని, ఇలా తేలిగ్గా తేల్చే విషయం కాదని స్పష్టం చేశారు.
మరోవైపు ఎస్‌డీటీటీ, ఎస్ఆర్టీటీలలో పాలనాపరమైన అంశాల్లో ఉన్న లోపాలపై వెంటనే దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర, చారిటీ కమిషనర్‌కు శ్రీనివాసన్ ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ దర్యాప్తు పూర్తయ్యేదాక సర్క్యులర్ తీర్మానాల ద్వారాగానీ, సమావేశాలతోగానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎస్డీటీటీని నిరోధించాలని కూడా సూచించారు. నోయెల్ టాటా జోక్యంపైనా హద్దులు పెట్టాలని కోరారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో నోయెల్ టాటా కుమారుడు నెవిల్లే టాటాను ఎస్డిటీటీ ట్రస్టీగా నియమించడంపైనా దర్యాప్తును శ్రీనివాసన్ కోరారు. శాశ్వత ధర్మకర్తగా నోయెల్ టాటా నియామకాన్నీ ప్రశ్నించడం గమనార్హం.