ముంబై, అక్టోబర్ 2: గృహ, వాహన, వ్యక్తిగత ఇతరత్రా రుణాలు భారం కానున్నాయా? అంటే.. అవుననే అంచనాలే వినిపిస్తున్నాయి. వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను జరుపనున్నది. ఈ సందర్భంగా కీలక వడ్డీరేటైన రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచవచ్చన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి మరి. ఇదే జరిగితే దానికి అనుగుణంగా బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచడం ఖాయం. ఫలితంగా హోమ్, ఆటో, పర్సనల్ తదితర లోన్ల ఈఎంఐలు పెరిగిపోతాయంటున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు.. దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలోనే గత నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.65 శాతంగా నమోదు కావచ్చని, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇది 6.5 శాతాన్ని దాటే వీలుందని ఎస్బీఐ రిసెర్చ్ తమ తాజా నివేదికలో పేర్కొన్నది. అమెరికా-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో పెరిగే క్రూడాయిల్ రేట్లు.. భారత్‌పై అనేక రకాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి.
మరోవైపు ఎల్ నినో కారణంగా వర్షాలు లేక వ్యవసాయం అంతంతమాత్రమే అన్నట్టు తయారైంది. ఈసారి ఆహార పంటల దిగుబడులు చాలావరకు తగ్గిపోవచ్చన్న అంచనాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో రూ.70-100 పలుకుతున్నాయి. పప్పు దినుసులు, వంట నూనెలు, పండ్లు, మాంసాహారం సంగతి సరేసరి. దీంతో రాబోయే నెలల్లో ఇటు రిటైల్, అటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభిస్తాయనే అంటున్నారంతా. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి ఈసారి ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ రెపోరేటును కనీసం పావు శాతమైనా తప్పక పెంచుతుందన్నదే ఎస్బీఐ రిసెర్చ్ మాట. నిజానికి గత ఏడాది డిసెంబర్ నుంచి రెపోరేటును ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతున్నది. ప్రస్తుతం అది 5.25 శాతంగా ఉన్న సంగతి విదితమే. ఈ నెల 5-7 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్య సమీక్ష జరుగనున్నది. బుధవారం సమీక్ష నిర్ణయాలు వెలువడుతాయి.
కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ దిగజారుతున్నది. మళ్లీ రూ.96 మార్కు ఎగువ (96.25)కు చేరింది. రూపీ నష్టాలు.. దేశీయ దిగుమతుల్ని భారం చేయడమేగాక, అన్ని రంగాలనూ దెబ్బ తీస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం విజృంభణకు రూపాయి విలువ పతనం కూడా కారణమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇక విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను అదేపనిగా ఉపసంహరించుకుంటుండటం కూడా దేశీయ డాలర్ నిల్వలపై ఒత్తిడిని పెంచుతున్నదని గుర్తుచేస్తున్నారు.
ఈ ఒక్క వారంలోనే భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.34,970 కోట్ల పెట్టుబడులను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వెనుకకు తీసుకున్నారు. కాగా, ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు.. గృహ, వాహన తదితర కీలక రంగాల్లో వృద్ధిని అడ్డుకోగలదని, ప్రజల కొనుగోలు శక్తిపైనా ఆ ప్రభావం పడగలదని విశ్లేషకులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు క్షీణించి, ఉత్పాదకత దెబ్బతినవచ్చని, ఉపాధి అవకాశాలూ సన్నగిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీరేట్లు పెరిగితే.. దేశ జీడీపీ తగ్గిపోయే ప్రమాదం కచ్చితంగా ఉందంటున్నారు. ఈ క్రమంలో రాబోయే ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ ఏం నిర్ణయం? తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అంతటా నెలకొన్నదిప్పుడు.
ఈ ఏడాది రెపోరేటును ఆర్బీఐ 50-75 బేసిస్ పాయింట్లు పెంచే వీలున్నది. స్థూల ఆర్థిక ప్రతికూలతలు, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య రాబోయే ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీరేట్లు పెరిగేందుకే ఆస్కారం ఎక్కువగా ఉన్నది.
-బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదిక
ఈ ఏడాది జరిగే రెండు ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీరేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరిగే వీలున్నది. వచ్చే ఏడాది జూన్‌కల్లా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచేందుకు అవకాశాలున్నాయి. మొత్తంగా వచ్చే 9 నెలల్లో రెపోరేటు 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) పెరుగవచ్చు.
-బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా