సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : 26 రోజుల జెన్జీల చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే వారి డిమాండ్ ఎట్టకేలకు సఫలమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. దీంతో జెన్జీలు దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. ఈ పోరాట ప్రక్రియపై విద్యార్థులు, జెన్జీలు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పోస్టు చేస్తున్నారు. జంతర్‌మంతర్ ఉద్యమానికి హైదరాబాద్ వేదికగా జెన్జీలు నడుంబిగించి ర్యాలీలు తీశారు. ఇందిరాపార్క్ వేదికగా నిరసనలు వ్యక్తం చేశారు. ఢిల్లీ పోరాటంలోనూ నగరం నుంచి భారీ సంఖ్యలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఆ పోరాట ఘట్టాలన్నీ వాళ్లంతా సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.

కాగా, మే 3న జరిగిన నీట్ -యూజీ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. మే 12న పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు అప్పగించిన విషయం తెలిసిందే. జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ అది సరైన విధానం కాదనీ.. విద్యావ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో జెన్ జీ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున తరలొచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. అప్పట్నుంచి వారి పోరాటానికి జెన్జీలు దేశవ్యాప్తంగా కదం తొక్కారు. కేంద్రం వారిపై లాఠీలను, బాష్పవాయుగోళాలను ప్రయోగించింది. అయినా అనేక కష్టాల మధ్య ఓర్పుతో తమ పోరాటాన్ని కొనసాగించారు. చివరికి వారి ఉద్యమంతో కేంద్రం దిగొచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిన పరిస్థితిని సృష్టించారు.