దేవరకొండ, సెప్టెంబర్ 28 : సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్–నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చందంపేట మండలం చిత్రియాల గ్రామ పంచాయతీ సర్పంచ్ చాట్ల చిరంజీవిని సోమవారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రమావత్ రవీంద్ర కుమార్ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, సర్పంచులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్, సర్పంచ్ రమావత్ కిషన్, మాజీ సర్పంచ్ కొండల్ రెడ్డి, బాణావత్ భారత, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.