Baahubali | తెలుగు సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ దౌత్య కార్యాలయాలు తమ సోషల్ మీడియా పోస్టులకు తెలుగు సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలను ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’లోని ప్రముఖ యుద్ధ సన్నివేశాన్ని షేర్ చేసింది.ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’లో ప్రభాస్ పోషించిన అమరేంద్ర బాహుబలి కాలకేయుల సైన్యంతో తలపడే సన్నివేశాన్ని ఇరాన్ కాన్సులేట్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలను జోడించింది.
“మేము తలవంచం.. మోకరిల్లం” అనే పెజెష్కియాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాలకేయులను ఎదుర్కొన్న బాహుబలిలాగే తమ దేశం కోసం తాము కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నామని సందేశంలో పేర్కొంది. ఈ విధంగా ఒక అంతర్జాతీయ రాజకీయ అంశానికి ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని ప్రతీకగా ఉపయోగించడం సోషల్ మీడియాలో విపరీతమైన దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ దౌత్య సంస్థలు తెలుగు సినిమాలను సోషల్ మీడియా సందేశాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాన్ని షేర్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇరాన్‌ను అంత సులభంగా ఎదుర్కోలేరనే భావనను వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్‌లో వ్యాఖ్యలు చేసింది.
అయితే ఆ పోస్టులో ‘భగవంత్ కేసరి’ని బాలీవుడ్ సినిమాగా పేర్కొనడం మాత్రం చర్చకు దారితీసింది. నిజానికి ఇది తెలుగు సినిమా కావడంతో భారతీయ నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తుచేస్తూ కామెంట్లు చేశారు.ఇప్పుడు అదే తరహాలో మరోసారి తెలుగు సినిమా నుంచి ప్రభాస్ ‘బాహుబలి’ని ఇరాన్ దౌత్య సంస్థ ఎంచుకోవడంతో తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని ఇరాన్ తన రాజకీయ సందేశానికి ఉపయోగించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ దౌత్య సందేశంలో భారతీయ సినిమా, అందులోనూ తెలుగు సినిమాకు చెందిన సన్నివేశాన్ని ఉపయోగించడం ఆసక్తికర పరిణామంగా పలువురు పేర్కొంటున్నారు.
Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: “Will never bow our head or bend the knee”
Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q
— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026