Chef Vishnu : నాగ్‌పూర్ (Nagpur) కు చెందిన ప్రఖ్యాత చెఫ్ విష్ణు మనోహర్ (Vishnu Manohar) సరికొత్త రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని అమరావతిలో 25 గంటలపాటు దోసెలు వేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియాలో స్థానం దక్కించుకున్నారు. పాత బైపాస్‌లో ఉన్న గున్వంత్ లాన్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి దోసెలు వేయడం ప్రారంభించిన విష్ణు ఆదివారం ఉదయం 8 గంటల సమయం వరకు 15,773 దోసెలు వేశారు.
దాంతో గత ఏడాది తాను నెలకొల్పిన రికార్డును ఆయనే బద్దలుకొట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా నిర్వహకులు పర్యవేక్షించారు. కాగా ఇప్పటివరకు విష్ణు మనోహర్ ఈ విధంగా తన స్టయిల్లో వంటల్లో ప్రయోగాలు చేసి, 30 రికార్డులు నెలకొల్పారు. ప్రస్తుతం నెలకొల్పిన రికార్డుతో వాటి సంఖ్య 31కి పెరిగింది.
గత ఏడాది నాగ్‌పూర్‌లో 24 గంటలపాటు దోసెలు వేసి రికార్డు సాధించానని.. ఇప్పుడు అమరావతిలో 25 గంటలపాటు దోసెలు వేశానని చెఫ్ విష్ణు మనోహర్ తెలిపారు. భవిష్యత్తులో పుణె, హైదరాబాద్, కాన్పూర్, శంభాజీ నగర్లలో ఒక్కో గంట పెంచుతూ దోసెలు వేసి రికార్డు సాధిస్తానని చెప్పారు.