హైదరాబాద్ : మూసీ(Musi river) పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాడు మూసీలోని మురుగు నీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతిపెద్దది అయిన నాగోల్ ఎస్టీపీని రూ. 4వేలకోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకండా, భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85 శాతం ఎఫ్టీపీ నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జీలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
బంగారు పల్లెంలో పెట్టి కేసీఆర్ తెలంగాణను అప్పగించారు. బీఆర్ఎస్ పాలనలో వికాసం, కాంగ్రెస్ పాలనలో విధ్వంసం కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇటుకను పేర్చనోడికి కూల్చే హక్కులేదని మండిపడ్డారు. కాంగ్రెస్ స్వార్ధం కోసం రూ. 16 వేల కోట్ల అయ్యే ప్రాజెక్ట్ వ్యయం పది రెట్లు పెంచి 1.50లక్షల కోట్ల భారీ స్కాంకు తెరతీశారని ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తున్నది. రేవంత్ రెడ్డి అన్న తిరుపుతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉంది అది కూలగొట్టే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.
ప్రజలను రోడ్డున పడేసి ఏం సాధిస్తారన్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇలా అందరి ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో దివ్యాంగులు ఇళ్లు కూల్చారు. ఖమ్మంలో పేదల గుడిసెలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌కు రూ.16 వేల కోట్లతో మూసీని సుందరీకరించడం చేతకాకపోతే మేము చేసి చూపిస్తామని సవాల్ విసిరారు.