న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కించపరిచే రీతిలో, పరువు నష్టం కలిగించే రీతిలో ఉన్న కాంటెంట్‌ను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సంస్థను ఇవాళ ఢిల్లీ పోలీసులు(Delhi Police) కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ సంస్థకు లేఖ రాశారు. ఈ అంశంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. ఉన్నత వ్యక్తులను టార్గెట్ చేస్తూ పోస్టు చేసిన వీడియోలను, మెసేజ్‌లను తక్షణమే డిలీట్ చేయాలని కోరుతూ పోలీసులు తమ లేఖను ఎక్స్ సంస్థను కోరారు. అయితే ఎక్కడ నుంచి ఆ కాంటెంట్ అప్లోడ్ అయ్యిందన్న విషయానికి చెందిన పూర్తి రిజిస్ట్రీ వివరాలు కావాలని కూడా ఎక్స్ సంస్థను పోలీసులు అడిగారు. అకౌంట్ ఎవరి పేరు మీద ఉన్నది, ఎవరి అడ్రస్ ఉంది, కాంటాక్ట్ డిటేల్స్ , ఈమెయిల్ ఐడీ లాంటి అన్ని వివరాలు వెల్లడించాలని ఢిల్లీ పోలీసులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆ అకౌంట్లకు చెందిన లాగిన్, లాగౌట్ రికార్డులు కూడా కావాలని ఎక్స్‌ను కోరారు. దర్యాప్తునకు అవసరమైన ఎటువంటి సమాచారాన్ని అయినా ఇవ్వాలని ఎక్స్ సంస్థను అడిగారు. పోస్టులు, వీడియోలకు చెందిన రికార్డులను దాచి పెట్టాలని, భవిష్యత్తులో దర్యాపునకు ఆ వీడియోలు సహకరిస్తాయని ఎక్స్ తన లేఖలో తెలిపింది. భారతీయ శిక్షా అధినియంలోని సెక్షన్ 63(4) కింద ఎక్స్ అకౌంట్ హోల్డర్లకు చెందిన సర్టిఫికేట్ కావాలని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసన ప్రదర్శనకు ముందు, తర్వాత జరిగిన కాంటెంట్ అప్లోడ్ గురించి దర్యాప్తులో భాగాంగా పోలీసులు సమీక్ష నిర్వహిస్తున్నారు.
రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన పోస్టులు, వీడియోలు, కామెంట్లను పోలీసులు స్క్రూట్నీ చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన సుమారు 400 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తప్పుడు కథనాలు, వదంతులు, డీప్‌ఫేక్ వీడియోలతో ఆ అకౌంట్లను నడిపిస్తున్నట్లు గుర్తించారు.