Arrest : ఓ ట్రక్ డ్రైవర్ తప్పతాగి (Drunken Truck Driver) వీరంగం సృష్టించాడు. ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయం (MLA office) ముందే ఓ వాహనాన్ని ట్రక్కుతో ఢీకొట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై తిరగబడ్డాడు. ఆఖరికి ఎమ్మెల్యే మాట్లాడే ప్రయత్నం చేసినా అతడిపై కూడా దాడికి యత్నించాడు. లారీలో నుంచి కత్తితీసి దాడి చేయబోయాడు. అస్సాం (Assam) లోని సోనిట్‌పూర్ (Sonitpur) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని సోనిట్‌పూర్‌లో శనివారం మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ బీజేపీ ఎమ్మెల్యేపై కార్యాలయం ముందు పార్క్‌చేసి ఉన్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో ఇదేంటని అక్కడే బీజేపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే ప్రశ్నించగా వారిపై తిరగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్చల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే రితు బరన్ శర్మ కార్యాలయం ముందర ఈ ఘటన జరిగింది.
రితు బరన్ శర్మ తన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కూర్చుని మాట్లాడుతుండగా గేటు ముందు ఓ కార్యకర్తకు చెందిన వాహనాన్ని ట్రక్‌డ్రైవర్ ఢీకొట్టాడు. దాంతో వారు బయటికి వచ్చి ట్రక్ డ్రైవర్‌ను ప్రశ్నించారు. దాంతో డ్రైవర్ వాళ్లపై తిరగబడ్డాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకుని డ్రైవర్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో మరింత రెచ్చిపోయిన ట్రక్ డ్రైవర్ తన లారీలో నుంచి కత్తిని బయటికి తీసి ఎమ్మెల్యేపై దాడికి యత్నించాడు.
కార్యకర్తలు అడ్డుకుంటున్నా ఆ డ్రైవర్ వారిని తోసుకుంటూ ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాడు. దాంతో స్థానికులు, కార్యకర్తలు కలిసి ఆ డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎమ్మెల్యే శర్మకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఒక హోమ్ గార్డుకు, ఇద్దరు పార్టీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.