Imran Khan : పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక రాజకీయ ఘర్షణతోనే ఉంటుంది. తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, ఆయన పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) నేతలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వంతో వారు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించాలని పీటీఐ నేతలు నిర్ణయించారు. దీంతో ఆదివారం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలివి. పాక్ ప్రభుత్వానికి, పీటీఐ మద్దతుదారులకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
వారి మధ్య గతంలో చర్చలు జరిగాయి. అనంతరం రెండో దశ చర్చలు అక్టోబర్ 3, శనివారం సాయంత్రం జరిగాయి. పీటీఐ ప్రతినిధులు, పాక్ ప్రభుత్వం మధ్య శనివారం సాయంత్రం ఐదు గంటలకు చర్చలు ప్రారంభంకగా.. ఆదివారం వేకువఝాము వరకు కొనసాగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో ముందుగా ప్రకటించినట్లుగానే ఆదివారం తమ పార్టీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ జరుగుతుందని పార్టీ ప్రకటించింది. నిజానికి సెప్టెంబర్ 27నే లాంగ్ మార్చ్‌కు ప్లాన్ చేశారు. అయితే, ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 4కు వాయిదా వేశారు.
శనివారం చర్చలు విఫలం కావడంతో ఈరోజు ఇస్లామాబాద్‌లో మార్చ్ నిర్వహించారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ప్రస్తుతం అక్కడి జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు ప్రభుత్వం సరైన వైద్యం కూడా అందించడం లేదు. దీంతో పీటీఐ నిరసన చేపట్టింది. తాజాగా ప్రభుత్వంతో పీటీఐ జరిపిన చర్చల్లో ఇదే కీలకాంశం. తమకు ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో కలుసుకునే అవకాశం ఇవ్వాలని పీటీఐ నేతలు కోరారు. అలాగే, ఆయనకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా చూడాలని డిమాండ్ చేశారు.
అది కూడా.. ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యులు ఆయనను పరీక్షిస్తారని సూచించారు. అలాగే, జైలులో ఉన్న ఖాన్ సోదరిని విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబికి కూడా వైద్యం అందించాలని కోరారు. ఇలాంటి అనేక డిమాండ్లకు పాక్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ర్యాలీకి పీటీఐ పిలుపునిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 1.00 గంటలకు గాంధీ చౌక్‌కు తరలిరావాలని పిలుపునిచ్చింది. అయితే, ఇస్లామాబాద్‌లో ఆందోళనల్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది.