Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ మధ్య కాలంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్… హరిహర వీరమల్లు చిత్రంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఓజీ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. పవన్ సినిమాలకు హిట్, ఫ్లాప్‌లతో సంబంధం ఉండదనే విషయం మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండడం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్లు కూడా ప్రారంభించింది.
మొదటగా ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మార్చి నెలలో విడుదల కావాల్సిన కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడటంతో బాక్సాఫీస్ పరిస్థితులు మారిపోయాయి. పెద్ది, ది ప్యారడైజ్ వంటి సినిమాలు షెడ్యూల్ నుంచి తప్పుకున్నాయి. ‘పెద్ది’ని ఏప్రిల్ 30కి వాయిదా వేయగా, ‘ది ప్యారడైజ్’ వేసవి రేసు నుంచి పూర్తిగా తప్పుకుని ఆగస్టుకు వెళ్లింది. ఇక టాక్సిక్ కూడా గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. అలానే మార్చి 19న రావాల్సిన డెకాయిట్ కూడా రిలీజ్‌ను వాయిదా వేసినట్లు సమాచారం. మరోవైపు దురంధర్ 2 విడుదలపై కూడా స్పష్టత లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్నిమార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఉస్తాద్ ఊచకోత అంటూ మార్చి 19న చిత్రం రిలీజ్ కానుందని ప్రకటించారు. మార్చి మూడో వారం ఉగాది, రంజాన్ పండుగలు ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.