e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

మంత్రిపై జులుం : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డిపై కేసు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ప‌రిధిలోని చౌటుప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. నిన్న చౌటుప్పల్‌ పట్టణంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు జగదీష్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి వచ్చిన రాజగోపాల్‌ రెడ్డి.. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. దీనిపై చౌటుప్ప‌ల్ త‌హ‌సీల్దార్ గిరిధ‌ర్ ఫిర్యాదు మేర‌కు రాజ‌గోపాల్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్ కమలాసన్‌ రెడ్డి బదిలీ

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్ కమలాసన్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా కమలాసన్‌ రెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో రామగుండం సీపీగా పనిచేస్తున్న సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా రమణకుమార్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎనుమాముల మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పత్తి ధర

- Advertisement -

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. ఈ సీజన్‌ అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పత్తిలో అత్యధికంగా క్వింటాకు రూ.7,840 ధర పలికింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలంలో గల శివాజీనగర్‌ గ్రామానికి చెందిన రైతు కోండ్లే సదయ్య 22 బస్తాల పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చాడు. కవిత ఎంటర్‌ప్రైజెస్‌ అడ్తి ద్వారా భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ కాటన్‌ ఖరీదు వ్యాపారి క్వింటాకు రూ.7,840లతో కొనుగోలు చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్ బ‌చ్చ‌న్

ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు, ప‌ద్మ‌విభూష‌ణ్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటారు. రామోజీఫిలిం సిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ బితోపాటు అక్కినేని నాగార్జున‌, నిర్మాత అశ్వినీద‌త్‌, ఫిలిం సిటీ ఎండీ విజ‌యేశ్వ‌రి పాల్గొన్నారు.

ఆగస్టు 3 నుంచి గాంధీలో అన్నిరకాల వైద్య సేవలు

సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో దవాఖానలో నాన్‌ కొవిడ్‌ సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. కేటీఆర్‌ బర్త్‌డే సంద‌ర్భంగా ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. అమెరికా న్యూ జెర్సీలోని టీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ..ముక్కోటి వృక్షార్చనకు సంఘీభావంగా అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శాఖలు మొక్కలు నాటి మద్దతు తెలిపారన్నారు.

Viveka Murder Case : అనుమానితులందరినీ విచారిస్తున్న సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా విచారిస్తున్నది. ఇవాళ కడప కేంద్ర కారాగారంలో ఉదయం నుంచి ఏడుగురు అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. 8 గంటలుగా విచారణ కొనసాగుతున్నది.

క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై

క‌ర్ణాట‌క కొత్త ముఖ్యమంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై ఎన్నిక‌య్యారు. ఈ సాయంత్రం బెంగ‌ళూరులో జ‌రిగిన క‌ర్ణాట‌క‌ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయ‌నను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన యెడియూర‌ప్ప ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క కేర్‌టేక‌ర్ సీఎంగా కొన‌సాగుతున్నారు.

కేర‌ళ‌లో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్‌..!

కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. అక్క‌డ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇవాళ అమాంతం పెరిగింది. ఇవాళ ఒక్క‌రోజే కేర‌ళ‌లో కొత్త‌గా 22,129 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివిటీ రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది. క‌రోనా మ‌ర‌ణాలు కూడా భారీగానే న‌మోద‌య్యాయి.

ఆగ‌స్టు నుంచి పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి

ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ వెల్ల‌డించారు. ఇవాళ బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని త‌మ పార్టీ ఎంపీల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

మీరాబాయి చానుకు బంప‌ర్ ప్రైజ్‌.. రూ.2 కోట్లు, రైల్వేలో ప్ర‌మోష‌న్‌

ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. సోమ‌వారం ఇండియాకు తిరిగి వ‌చ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను క‌లిసింది. ఈ సంద‌ర్భంగా మీరాబాయిని ఆయ‌న‌ స‌న్మానించారు. అంతేకాదు రూ.2 కోట్ల న‌గ‌దు, ఈశాన్య రైల్వేలో ప్ర‌మోష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈశాన్య రైల్వేలో ప‌ని చేస్తున్న ఆమెను ఇప్పుడు ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా ప్ర‌మోట్ చేశారు.

Olympics: నాలుగోరోజూ నిరాశే.. ఆ రెండూ త‌ప్ప అన్నింట్లోనూ ఫెయిల్‌

ఒలింపిక్స్‌లో రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఇండియ‌న్ అథ్లెట్లు ఒక్కొక్క‌రుగా ఉత్త చేతుల‌తో వెనుదిరుగుతున్నారు. తొలి రోజే మీరాబాయి చాను సిల్వ‌ర్‌తో మెర‌వ‌డం త‌ప్ప త‌ర్వాతి మూడు రోజులూ ఇండియ‌న్ టీమ్‌కు తీవ్ర నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితాలే వ‌చ్చాయి. నాలుగో రోజైన మంగ‌ళ‌వారం కూడా ప‌రిస్థితి అలాగే ఉంది. మెన్స్ హాకీ టీమ్‌, బాక్స‌ర్ లవ్లీనా విజయాలు త‌ప్ప మిగ‌తా అన్నింట్లోనూ మ‌న‌వాళ్లు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

టీమిండియా క్రికెటర్‌కు కరోనా.. శ్రీలంకతో రెండో టీ20 వాయిదా

శ్రీలంక టూర్‌లో ఉన్న ఇండియ‌న్ టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా ఈ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి. ఒక‌వేళ టీమ్స్‌లోని అంద‌రు ప్లేయ‌ర్స్ నెగటివ్‌గా తేలితే.. బుధ‌వారం ఈ రెండో టీ20 నిర్వ‌హిస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana