మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Sep 01, 2020 , 02:26:06

‘తెర’గతులు!

‘తెర’గతులు!

నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి విద్యా సంవత్సరం జూన్‌ నెలలోనే ప్రారంభం కావాల్సింది. కానీ, కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైంది. గతంతో పోలిస్తే దాదాపు నాలుగు నెలలు ఆలస్యంగా బోధన ప్రారంభమవుతున్నది. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యా విధానంలో సమూలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బోధన అనేది తరగతి గదికే పరిమితం కాదని, మారుతున్న కాలంలో డిజిటల్‌ పద్ధ్దతుల్లో కూడా పాఠాలు బోధించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం సిద్ధమయ్యారు. కరోనా  నేపథ్యంలో ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే స్థితిలో లేరు. దీంతో విద్యార్థులు  విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో, ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యను తెరమీదకు తెచ్చింది. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటే పాఠశాలలు, కళాశాలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యా విధానంలో పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులను సిద్ధం చేసింది.  - మెదక్‌

n నేటి నుంచి అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ పాఠాలు 

n కరోనా నేపథ్యంలో ఇండ్ల నుంచే చదువులు

n ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3,15,979 మంది విద్యార్థులు 

n ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

n టీశాట్‌, దూరదర్శన్‌ చానెళ్ల ద్వారా తరగతుల నిర్వహణ

n విద్యార్థులను పర్యవేక్షించనున్న ఉపాధ్యాయులు 

n ఇప్పటికే విధులకు హాజరవుతున్న  ఉపాధ్యాయులు

ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి నుంచి దాదాపు ఆరు నెలలుగా పాఠశాలలు మూతపడ్డాయి. కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతుండడంతో బడులు తెరువలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దని ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చేసింది. దూరదర్శన్‌, యాదగిరి, టీశాట్‌ చానళ్ల ద్వారా, అలాగే నిపుణ విద్య, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా కూడా తరగతులు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆన్‌లైన్‌ బోధన విషయాలపై శిక్షణ సైతం పూర్తిచేశారు. నేటి నుంచి పాఠశాల విద్యార్థ్ధులకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి తరగతులు వినాలని, 50శాతం చొప్పున ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తిచేశారు. ఉపాధ్యాయులు ఆయా తరగతులకు సంబంధించిన విద్యార్థుల వివరాలను సేకరించి, వారికి పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు.

ఏర్పాట్లు పూర్తిచేశాం..

నేటి నుంచి ఆన్‌లైన్‌లో బోధనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆరు రోజుల నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. మంగళవారం నుం చి టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా పాఠాల బోధన ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఉపాధ్యాయులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ బోధనపై శిక్షణ ఇచ్చాం. విద్యార్థ్ధులకు ఆన్‌లైన్‌ పాఠాల విషయంలో తల్లిదండ్రులు సహకరించాలి.


logo