ADR | న్యూఢిల్లీ, మే 10: పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో తారుమారు చేసే పద్ధతులు ఉండకూడదని అభిప్రాయపడింది. వాస్తవానికి, ఎన్నికల సంఘం పోలింగ్ రోజే సాయంత్రం 7 గంటలకు ఆ రోజు నమోదైన పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తుంది.
కచ్చితమైన పోలింగ్ శాతాన్ని చాలా రోజుల సమయం తర్వాత విడుదల చేస్తున్నది. ప్రస్తుత లోక్సభ ఎన్నికలనే తీసుకొంటే.. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు పూర్తవ్వగా, ఆ రోజు సాయంత్రం ప్రాథమికంగా పోలింగ్ శాతాన్ని వెల్లడించింది. ఆ తర్వాత 11 రోజులకు అంటే.. ఏప్రిల్ 30న తుది పోలింగ్ శాతాన్ని తెలిపింది. ఏప్రిల్ 19న చెప్పిన శాతం కంటే.. 30న చెప్పినది 5-6 శాతం ఎక్కువ ఉండటం గమనార్హం.