బడంగ్‌పేట, మార్చి 11: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులకు గ్రహణం పట్టిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడలోని చందన చెరువును ఆమె పరిశీలించారు. వాకర్స్‌తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, గుర్రపు డెక్కను పరిశీలించారు.
చెరువు అభివృద్ధి పనులు నాసిరకంగా చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువుల నిర్వహణ గాలికి వదిలేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులను సుందరీకరిస్తే కాంగ్రెస్ సర్కారు చెరువులను కాలుష్య కాసారాలుగా మార్చేసిందన్నారు. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి వెంట మాజీ ప్రజా ప్రతినిధులు ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, పల్లె జంగయ్య గౌడ్, కామేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.