మన్సూరాబాద్: వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని అమాయక ప్రజలను నమ్మించి రూ. 2 కోట్లు డబ్బులు కాజేసిన కేసులో ఓ మహిళను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ కథనం ప్రకారం.. బోయగూడకు చెందిన చెవగాని కవిత (44) నాగోల్, మమతానగర్ కాలనీ రోడ్డు నం. 2లో విజన్ ఇన్ఫ్రా పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ప్రకటనలు గుప్పించింది. లక్ష రూపాయలు పెడితే వంద రోజుల్లో రూ. 80 వేల వడ్డీ ఇస్తామని చెప్పడంతో ప్రజలు నమ్మారు.
నాగోల్‌కు చెందిన సుమారు 25 మంది రూ. 2 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడుదారులకు నమ్మకం కలిగేందుకు దేవరకొండ నియోజకవర్గంలోని మల్లేపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమిని సెక్యూరిటీగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసింది. కాగా, పెట్టుబడులు పెట్టి 100 రోజులు దాటినా వడ్డీ ఇవ్వకపోగా.. అసలు విషయంపై మాట్లాడక పోవడంతో అనుమానం కలిగింది. నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సంధ్య, బాబునాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవితను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.