రుద్రంపూర్, ఆగస్టు 17 : “గనిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలి” అని సింగరేణి డైరెక్టర్ (పి&పీ) కె. వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్ ను సోమవారం ఆయన సందర్శించి గని కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గనిలో కొనసాగుతున్న కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించిన డైరెక్టర్ పి&పీ.. భద్రతా చర్యలు, రక్షణ చర్యలు, బొగ్గు సరఫరా పరిస్థితి, ఓవర్‌బర్డెన్ రిమూవల్ (OBR) పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. “ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలి. ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి. రక్షణ ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలి” అని ఆయన సూచించారు.
అదేవిధంగా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. OBR పనితీరును మెరుగుపరచడం ద్వారా భవిష్యత్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. గని కార్యకలాపాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు భద్రతకు పెద్దపీట వేయాలని, సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకట రమణ, జీఎం (సేఫ్టీ) కార్పొరేట్ సాయిబాబు, ఎస్వో టు జీఎం, యాక్టింగ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, మేనేజర్ మురళి తదితర అధికారులు పాల్గొన్నారు.