Amit Shah : బీజేపీతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్) అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముంబైలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తీవ్రవాదాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు తీవ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాయన్నారు.
అలాగే, వివిధ రంగాల్లో భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే పాలన నడుస్తోందని, ఈ రాష్ట్రాల్లో 2029లోపు యూసీసీని అమలు చేస్తామని వివరించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు దిశగా చర్యలు తీసుకున్నామని, వచ్చే లోక్సభ ఎన్నికల్లోపు మిగతా రాష్ట్రాల్లోనూ యూసీసీని అమలు చేస్తామన్నారు. 2014 నుంచి దేశంలో అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు దూరంగా గొప్ప పనితీరు కలిగిన రాజకీయాలు సాగుతున్నాయని షా చెప్పారు. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
వెనుకబడిన ఐదు ఆర్థిక వ్యవస్థల జాబితా నుంచి ఇండియా టాప్ 5 ఆర్థిక వ్యవస్థలు కలిగిన జాబితాలో చేరిందన్నారు. ఇండియా 7.8 శాతం జీడీపీ నమోదు చేసిందని గుర్తు చేశారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యల్ని బీజేపీ పరిష్కరించిందన్నారు. ఆర్టికల్ 370, నక్సలిజం, ఈశాన్య భారతంలో ఉన్న సమస్యల్ని తమ బీజేపీ ప్రభుత్వం పరిష్కరించిందని వివరించారు. మరోవైపు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు.