కట్టంగూర్, ఆగస్టు 17 : హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన వృద్ధుడికి కొద్దిసేపటికే ఊహించని ప్రమాదం ఎదురైంది. బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఫుట్‌బోర్డుపై నిల్చున్న ప్రయాణికుడు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో బస్సు టైర్లు కాలుపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కట్టంగూర్ మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన ముత్తయ్య (60) సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు కట్టంగూర్ బస్‌స్టాప్‌లో బస్సు ఎక్కాడు. బస్సు కదిలిన కొద్దిసేపటికే డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఫుట్‌బోర్డుపై ఉన్న ముత్తయ్య ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు టైరు అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కట్టంగూర్ అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ శివాని, పైలట్ శేఖర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడే ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అప్పటివరకు హైదరాబాద్ వెళ్లాలనుకున్న ముత్తయ్య.. క్షణాల్లోనే ఆస్పత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై నిల్చోకుండా, బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని స్థానికులు కోరుతున్నారు.