కోల్ సిటీ : గోదావరిఖని గాంధీనగర్లో మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణా ఉపాధి కేంద్రం నిర్వాహకుడు డీ. కృష్ణకుమార్ ( Krishnakumar ) మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) , రామగుండం మాజీ శాసన సభ్యులు కోరుకంటి చందర్ ( Korukanti Chander ) అన్నారు. గత ఐదు నెలలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణకుమార్ సోమవారం తుది శ్వాస విడిచారు.
ఆయన మరణం వార్తను తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు శారదనగర్ లో గల ఆయన నివాసం వద్ద మృతదేహాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధి మాంద్యంతో పుట్టి విధి వంచితులైన పారిశ్రామిక ప్రాంతంలోని ఎంతోమంది మానసిక దివ్యాంగులను చేరదీసి, వారితో వివిధ స్టేషనరీలు తయారు చేయించి స్వయం ఉపాధి కల్పించడంలో కృష్ణ కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
మానసిక వికలాంగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన అకాల మృతి తీరని లోటుగా భావిస్తున్నట్లు తెలిపారు. పలు రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, పలు ఆశ్రమాల నిర్వాహకులు కృష్ణకుమార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.