Maharashtra : అన్ని రూల్స్ పాటిస్తున్నా సరే మహరాష్ట్ర అధికారులు ఒక స్వీట్ షాప్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వీట్ షాప్ మూసివేసి నష్టం కలిగించారు. దీంతో స్వీట్ షాప్ యాజమాన్యానికి రూ.5 లక్షలు చెల్లించాలని అధికారులను బాంబై హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. పూనేలోని గురునానక్ డైరీ అండ్ స్వీట్స్ అనే షాపుపై ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ షాపులోని స్వీట్స్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందనేది ఆ ఫిర్యాదు. దీనిపై మహారాష్ట్రకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు స్పందించారు.
గత జూన్ 12న ఈ షాపును తనిఖీ చేసి, లైసెన్స్ రద్దు చేశారు. దీనిపై మూడు రోజుల తర్వాత ఆ షాపు యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత జూలై 9న ఎఫ్‌డీఏకు ఒక రిపోర్ట్ సమర్పించింది. దీంతో మళ్లీ నాలుగు రోజుల తర్వాత స్వీట్ షాపులో రెండోసారి తనిఖీ నిర్వహించారు. ఇందులో పాటించాల్సిన 36 రూల్స్కుగాను ఆ స్వీట్ షాప్ 35 పాయింట్లు సాధించింది. అంటే, 98 శాతం అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ ఈ షాప్ లైసెన్స్‌ను అధికారులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై ఒక నివేదిక, వినతి పెండింగ్‌లో ఉన్నందున స్వీట్ షాపు తెరిచేందుకు అనుమతివ్వడం కుదరదని ఎఫ్‌డీఏ తెలిపింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ షాపు యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ రవీంద్ర వి ఘుగె, జస్టిస్ గౌతమ్ ఏ అంఖడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అన్ని నిబంధనలు పాటిస్తూ, 36 పాయింట్లకు 35 పాయింట్లు సాధించిన స్వీట్ షాప్‌నకు లైసెన్స్ ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వెంటనే సంస్థకు లైసెన్స్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇది అధికారుల విపరీత దోరణికి నిదర్శనం అని, నిబంధనలు పాటిస్తున్నా ప్రజల్ని వేధిస్తారా అంటూ ప్రశ్నించింది. ఇదే సమయంలో తమ షాపు 34 రోజులుగా మూసి ఉందని, దీని వల్ల తమకు రూ.8 లక్షలకుపైగా ఆదాయం కోల్పోయామని షాపు యాజమాన్యం కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు.. షాపు యాజమాన్యానికి రూ.5 లక్షలు పరిహారం కింద చెల్లించాల్సిందిగా ఎఫ్‌డీఏను ఆదేశించింది. 30 రోజుల్లోగా ఈ డబ్బు వారికి అందించాలని సూచించింది.