Sukumar | టాలీవుడ్లో దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన వద్ద పనిచేసి దర్శకత్వంలోకి వచ్చిన పలువురు యువ దర్శకులు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా సహజత్వం, రా అండ్ రస్టిక్ కథనాలు, బలమైన భావోద్వేగాలతో సినిమాలను తెరకెక్కించడం సుకుమార్ శిష్యుల పనితీరులో కనిపించే అంశాలుగా మారాయి. అయితే తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకులు రెండో సినిమాతో అదే స్థాయిలో మెప్పిస్తారా? అనే చర్చ ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో ఉంది.ప్రస్తుతం ఈ చర్చ సుకుమార్ శిష్యులు బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల చుట్టూ తిరుగుతోంది. తొలి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ఈ ఇద్దరు దర్శకులు తమ రెండో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కింది.భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’లో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే కథనం, కొన్ని పాత్రల రూపకల్పన, నాటకీయత విషయంలో దర్శకుడిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై బుచ్చిబాబు కూడా స్పందిస్తూ వివరణ ఇచ్చారు.అయితే బాక్సాఫీస్ పరంగా కూడా ‘పెద్ది’పై విడుదలకు ముందు ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ఫలితం రాలేదనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు రెండో సినిమాతో ఎదుర్కొన్న అనుభవాన్ని సినీ వర్గాలు ‘ద్వితీయ విఘ్నం’గా ప్రస్తావిస్తున్నాయి.
ఇక ఇప్పుడు మరో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘దసరా’తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల.. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాని నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో శ్రీకాంత్ ఓదెలపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇప్పుడు నానితోనే మరోసారి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యంత కీలకంగా మారింది. ‘దసరా’లో గ్రామీణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది ప్యారడైజ్’లో మరింత భారీ స్థాయి కథను తీసుకున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రెండో సినిమాతో దర్శకుడి పరిధి, ఆలోచనా విధానం మరింత విస్తరించడం సహజం. అదే సమయంలో అంచనాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ కారణంగానే తొలి విజయాన్ని రెండో సినిమాతో కొనసాగించగలరా? అనే చర్చ దర్శకుల కెరీర్లో ఆసక్తికర అంశంగా మారుతుంది.