సిటీబ్యూరో/జగద్గిరిగుట్ట, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన బుధవారం మాదాపూర్ న్యాక్ ప్రధాన కార్యాలయంలో హెచ్ సిటీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఐఐటీ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్, డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ పనులను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికల్లా పూర్తిచేసే విధంగా షెడ్యూల్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 31వ తేదీలోగా భూ బాధితులను సమన్వయం చేసి టీడీఆర్లకు అంగీకరించేలా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, సీసీపీ వెంకన్న, సీపీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యంపై అసహనం..
పారిశుధ్య ర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ జోన్ చింతల్ సర్కిల్ సరిధిలో బుధవారం ఆమె పర్యటించారు. సర్కిల్ కార్యాలయం సమీపంలోని గాంధీనగర్ పరిసరాల్లో వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంపత్ అనే ఉద్యోగి తీరును ఆమె తప్పుబట్టారు. అతనికి నెల వేతనాన్ని నిలిపివేయడంతోపాటు చర్యలకు ఆదేశించారు. ఐడీపీఎల్చౌరస్తా, రంగారెడ్డినగర్, వెంకట్రామిరెడ్డినగర్ పరిసరాల్లో నిర్వహణ తీరును పరిశీలించారు. డీసీ లావణ్య, శానిటేషన్ డీఈ సాగర్, ఏఈ విజయ్, జవాన్ రాజు సిబ్బంది పాల్గొన్నారు.