వికారాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): బాధితుల పక్షాన నిలువాల్సిన రక్షక భటులు ఇక్కడ నిందితుల పక్షాన చేరారు. చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసులే అవినీతి రొంపిలో దూరారు. కాసులకు కక్కుర్తిపడి న్యాయం కండ్లకే గంతలు కట్టారు. ఇలాంటి అవినీతి పోలీసులే పోలీస్ శాఖ పరువు తీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంచలన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అది కూడా ఆ జిల్లా కీలక అధికారి తనిఖీల్లో వెల్లడయ్యాకే ఆ స్టేషన్ సిబ్బందిలో కదిలిక రాగా, అయినా ఆ కేసును నీరుగార్చేందుకు వారు ఆడిన నాటకం అంతాఇంతా కాదు. వికారాబాద్ జిల్లాలోని ఓ ఠాణా పరిధిలో 5 నెలల క్రితం సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ఆన్లైన్ గేమ్స్‌లో భాగంగా ఓ యువకుడి నుంచి సైబర్ క్రైమ్ నేరగాళ్లు సుమారు రూ.50 వేల వరకు కొట్టేశారు. దీంతో బాధితుడు ఆ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన పోలీసులు.. వారం, పది రోజులకే నిందితులను గుర్తించినట్టు తెలిసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌కు చెందిన ఆ నిందితులను ఇక్కడి స్టేషన్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే వారిని అరెస్ట్ చేయకుండా అక్కడి పోలీసులు నిందితుల తరఫున డీల్ కుదిర్చినట్టు సమాచారం. నిందితుల వద్ద రూ.లక్షల్లో తీసుకున్న ఇక్కడి పోలీసులు అరెస్ట్ చేయకుండానే వచ్చి కేసును పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది.
ఇటీవల జిల్లా కీలక అధికారి సంబంధిత పోలీస్‌స్టేషన్ తనిఖీలో భాగంగా కేసుల వివరాలపై ఆరా తీశారు. అప్పుడు బయటపడింది ఈ కేసు బాగోతం. నిందితులను నెలలపాటు ఎందుకు అరెస్ట్ చేయలేదని సదరు ఎస్‌హెచ్‌వోపై ఆ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఆ సిబ్బందిలో కదలిక వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ కేసులో నిందితులు 10 మంది వరకు ఉన్నారు. అవినీతి ఒప్పందంలో భాగంగా వారిలో ఓ ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకోగా, నిందితులతో ఆ జిల్లాకే చెందిన ఓ గ్రామ సర్పంచ్ కూడా వచ్చినట్టు తెలిసింది.
సైబర్ క్రైమ్ నిందితులతో పోలీసులు కుదుర్చుకున్న ఒప్పందంతో కనీసం 24 గంటలు కూడా జైలు శిక్ష అనుభవించలేదని తెలిసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సదరు పోలీసులు వెంటనే బెయి ల్ వచ్చేలా బలహీన సెక్షన్లు పెట్టి పూర్తిగా సహకారం అందించినట్టు సమాచారం. చార్జిషీట్ సిద్ధంచేసి రిమాండ్ చేసేందుకు కోర్టులో హాజరుపర్చగా, నిందితులకు రిమాండ్ విధించబోరని పోలీసులు అనుకున్నారు. పోలీసులకు న్యాయమూర్తి షాకిచ్చి రిమాండ్ విధించినట్టు తెలిసింది. దీంతో రూ.లక్షల్లో డీల్ కుదుర్చుకున్న సదరు పోలీసులకు ఏం చేయాలో తోచ క మరో ప్లాన్ రెడీ చేసి వెంటనే బెయిలొచ్చేలా చేశారు.
రిమాండ్ విధించినప్పటికీ నిందితులను జైలుకు తీసుకెళ్లకుండా జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మరుసటి రోజు బె యిల్ పిటిషన్ వేయించినట్టు ప్రచారం జరుగుతుంది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత సాయంత్రం ఇద్దరు నిందితులను జైలు అధికారులకు అప్పగించగా, ఆ మరునాడు ఉదయమే ఆ నిందితులిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చినట్టు తెలిసింది.
నిందితులకు ఆశ్ర యం కల్పించిన పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ పరిశీలిస్తే పోలీస్ ఉన్నతాధికారులకు పూర్తి విషయం తెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేకు దగ్గరైన సదరు పోలీస్ అధికారి ‘అంతా నా ఇష్టం’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు మొదలుకొని ప్రతి విషయంలోనూ ఆ అధికారి చెప్పించే వేదంలా నడుస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.