మహబూబ్ నగర్ :తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ప్రారంభించిన కల్యాణలక్ష్మి ( Kalyana Lakshmi )పేద ఆడబిడ్డల పెండ్లికి అండగా నిలిచిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) అన్నారు. కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి 12 సంవత్సరాల్లో లక్షలాధి కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు.
ఈ సందర్భంగా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి మహిళలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం( Palabhishekam) చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో కల్యాణ లక్ష్మికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ పథకం మేనమామ లాగా అండగా నిలిచిందన్నారు. ఆడబిడ్డల పెండ్లి కోసం ఇబ్బంది పడుతున్న లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చిందన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలోనే పదివేల కుటుంబాలు లబ్ధి పొందాయని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజల తరుపున కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కల్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.