Thellakagitham | ‘తెల్లకాగితం’ సినిమా రివ్యూ: టీనేజ్ పొరపాట్లు, భావోద్వేగాల ప్రయాణం!
Thellakagitham Movie | సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని, నేటి తరానికి ఒక గట్టి సందేశాన్ని అందించే ప్రయత్నమే 'తెల్లకాగితం'.
Thellakagitham Movie | సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని, నేటి తరానికి ఒక గట్టి సందేశాన్ని అందించే ప్రయత్నమే ‘తెల్లకాగితం’. భీమవరం నేపథ్యంగా సాగే ఈ చిత్రం కేవలం ఒక సాధారణ ప్రేమకథ మాత్రమే కాదు; టీనేజ్ వయసులో అజాగ్రత్తగా ఉండే పిల్లలు, వారి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని కఠినమైన సత్యాలను ఈ సినిమా కళ్లకు కట్టింది. హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర (Bogapathi Nakshatra) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా.. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
రాము (హర్ష్ రోషన్) భీమవరం దగ్గరిలోని ఒక గ్రామంలో తన అన్న, వదినల దగ్గర నివసిస్తుంటాడు. అయితే అక్కడున్న పాఠశాలలో చదివే ఆశ (నక్షత్ర)తో అతనికి అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. మధ్యాహ్న భోజన బాక్స్‌లు మారడం వల్ల మొదలైన ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రథమ ప్రేమగా మారుతుంది. అయితే, వయసుకు తగిన పరిణతి లేకపోవడం వల్ల ఆ ఇద్దరూ శారీరక సాన్నిహిత్యానికి లోనవుతారు. దీని ఫలితంగా ఆశ గర్భవతి కావడం, ఆ తర్వాత వారి జీవితాల్లో వచ్చే ఊహించని మలుపులు కథను తీవ్రమైన మలుపు తిప్పుతాయి. జీవితమనే ఒక ‘తెల్లకాగితం’పై చిన్న మరక పడితే అది ఎంతటి అల్లకల్లోలానికి దారితీస్తుందో అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి ఎంచుకున్న పాయింట్ సమాజానికి ఎంతో అవసరమైనది. టీనేజ్ పిల్లల్లో వచ్చే హార్మోన్ మార్పులు, శారీరక పరివర్తన, కండోమ్ వంటి సున్నితమైన అంశాలను ఎక్కడా అసభ్యత లేకుండా, కేవలం అవగాహన కోణంలో తెరకెక్కించిన విధానం అభినందనీయం. సినిమా ప్రథమార్థం సరదా కాలక్షేప సన్నివేశాలు, కామెడీతో సాగిపోతుంది. అయితే, అసలైన కథ మరియు భావోద్వేగాలన్నీ చివరి అరగంటలోనే కేంద్రీకృతమయ్యాయి. మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. విజయ్ బుల్గానిన్ అందించిన ‘చిలక’ పాట వినసొంపుగా ఉంది, నేపథ్య సంగీతం సన్నివేశాల తీవ్రతను పెంచింది. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమాటోగ్రఫీ ఎంతో రిచ్‌గా ఉంది.
నటీనటులు
బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన హర్ష్ రోషన్, ‘కోర్ట్’ చిత్రం తర్వాత ఈ చిత్రంలో రాము పాత్రలో చక్కని పరిణతి కనబరిచాడు. తెలియని వయసులో తప్పు చేయడం, ఆ తర్వాత భయంతో సతమతమవడం, చివరకు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడే సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. మొదటి సినిమా అయినప్పటికీ, ఆశ పాత్రలో నక్షత్ర ఆమె లుకింగ్ పరంగా ఆకట్టుకుంది. అయితే, జీవితాన్ని మార్చేసే క్లిష్టమైన భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటనకు ఇంకాస్త అవకాశం ఉండేదనిపిస్తుంది. రాము వదిన పాత్ర, మామయ్య పాత్ర (రాజ్ కసిరెడ్డి), ఆశ తండ్రి మూర్తి పాత్రలో నటించిన అజయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు జీవించారు. ముఖ్యంగా వదిన చెప్పే మాటలు, ఆమె పడే వేదన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
చివరిగా.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు భయపడి పక్కదారి పట్టడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. బంధువులనో, ఇతరులనో ఆశ్రయించి మోసపోవడం కంటే, నేరుగా తల్లిదండ్రులకు నిజం చెప్పడమే ఉత్తమమని ఈ సినిమా బలంగా చెబుతుంది. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతటి ఓపికతో, బాధ్యతతో వ్యవహరించాలో ఈ చిత్రం చక్కటి గుణపాఠం నేర్పుతుంది. ఇది కేవలం ఒక వినోదాత్మక చిత్రం మాత్రమే కాదు; నేటితరం టీనేజర్లు, వారి తల్లిదండ్రులు కలిసి చూడవలసిన ఒక సామాజిక దృశ్యకావ్యం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

