హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ఖజానా నింపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణానికి సమాధి కడుతున్నది. చరిత్ర, వారసత్వాన్ని పరక్షించాల్సిన సర్కారే.. వందల ఏండ్ల నాటి అరుదైన సహజ సంపదను అంగడి సరుకుగా మార్చేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ హయాంలో పచ్చదనం, ప్రకృతి రక్షణతో విలసిల్లిన హైదరాబాద్ నగరం.. కాంగ్రెస్ పాలనలో కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నది. కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరువక ముందే తాజాగా దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పన్మక్తాలోని 11 ఎకరాల భూములను రేవంత్ సర్కార్ మార్కెట్లో పెట్టింది. అరుదైన వారసత్వ గుట్టలు కలిగిన ఈ ప్రాంత భూములను వేలం వేయడంపై మరో పర్యావరణ ఉద్యమం రాజుకుంటున్నది.
రాయదుర్గం పన్మక్తాలోని సర్వే నంబర్ 83/1లో హైటెక్ సిటీ వైపు, ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో ఉన్న 5.25 ఎకరాలు, 5.38 ఎకరాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లను వేలం వేసేందుకు సర్కార్ నోటిఫికేషన్ జారీచేసింది. ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరతో ఈ నెల 21, 28 తేదీల్లో వేలం వేయనున్నది. కేవలం రూ.1,800 కోట్లను సమకూర్చుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం ఉన్నది.
ప్రపంచంలోనే అత్యంత పురాతన దక్కన్ పీఠభూమి రాతి నిర్మాణాల్లో గుట్టల భాగం ఉన్నది. వీటికి వేల ఏండ్ల చరిత్ర ఉన్నదని, డైనోసార్లు, హిమాలయాల ఆవిర్భావం కంటే ముందునుంచే ఇవి ఉన్నాయనీ పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇవి హెచ్ఎండీఏ జోనింగ్ నిబంధనల ప్రకారం రక్షించిన 23 వారసత్వ రాతి నిర్మాణాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ సంస్థ కూడా ఈ ప్రాంతాన్ని ప్రత్యేక హెరిటేజ్ సంపదగా గుర్తించి పరిరక్షణకు కృషి చేస్తున్నది. ఇలాంటి అరుదైన, సహజ సిద్ధమైన భౌగోళిక వింతలను రక్షించాల్సింది పోయి రాత్రికిరాత్రే బుల్డోజర్లతో కూల్చివేసేందుకు ప్లాన్ చేయడం.. పర్యావరణంపై కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
వేలానికి పెట్టిన ఈ భూములు దుర్గం చెరువు పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. పచ్చటి వృక్ష సంపద, అరుదైన కొండ చరియలు చెరువు వైపు వాలి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే సరస్సులోకి నీటి రాక నిలిచిపోతుంది. వానకాలంలో చెరువులోకి వచ్చే సహజ ప్రవాహాలు ఆగిపోతాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఊపిరాడని స్థితిలో ఉన్న రద్దీకి తోడు, ట్రాఫిక్ సమస్య మరింత భయానకంగా మారుతుంది. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు సర్కార్ చర్యలను నిలువరించేందుకు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఒకానొక దశలో ఈ భూములను వేలం వేసి డీఎల్ఎఫ్ సంస్థకు కేటాయించినా ఆ భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఆ సంస్థకు ప్రత్యామ్నాయంగా భూమినిచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడి పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేసి ఇలాంటి అరుదైన వారసత్వ సంపదను పరిరక్షించింది.
ఈ ప్రాంతాన్ని హెరిటేజ్ రాక్ పార్క్‌గా మార్చాలని దాదాపు 15-20 ఏండ్ల క్రితమే సొసైటీ టూ సేవ్ రాక్స్ తరఫున ఉద్యమిస్తున్నం. అప్పట్లో ఓ సంస్థకు కేటాయించినప్పుడే ప్రజాసంఘాల ఒత్తిడితో అప్పటి సర్కార్ వెనక్కి తగ్గింది. భూమిని తిరిగి ప్రభుత్వానికి కట్టబెట్టిన తర్వాత రాక్ గార్డెన్ చేయాలని డిమాండ్ చేశాం. నానాటికీ కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న హైదరాబాద్‌కు ఇలాంటి లంగ్ స్పేస్ ఎంతో అవసరం. దుర్గం చెరువు నీటి మట్టాన్ని, జలావరణాన్ని పరిరక్షిస్తాయి.
-సంగీత వర్మ, ఉపాధ్యక్షురాలు, సొసైటీ టు సేవ్ రాక్స్