Pothana Bhagavatam | సాత్తిక భాగవతుడే కాక సహజ కవితా భాగధేయుడు- భాగ్యశాలి, కావటం వలన భగవద్విధేయులైన భక్తులందరితో మమేకమై- భావసారూప్యాన్ని భజించి, భక్తి కవితా వేణువు మోగించి, త్రిలింగ దేశాన్ని ఉర్రూతలూగించి, భాగ్యశాలురైన తెలుగువారిని తరింపజేసిన పోతన అమాత్యుడు బమ్మెర వంశంలో అవతరించిన అపర వంశీధరుడు! తెలుగు భాగవతం సప్తమ స్కంధం మొదలుగా దశమం వరకు పోతన అనువాద కళ ఆసాంతం అత్యుత్తమంగా పూతనారి కృష్ణ చంద్రుని షోడశ కళల వెలుగు జిలుగుల వన్నెచిన్నెలతో నిత్యనూతనంగా విరాజిల్లింది.
మహావిష్ణువు దర్శనానికి వైకుంఠ నగరికి వేంచేసిన విరించి (బ్రహ్మ) మానస పుత్రులైన సనత్కుమారులను జయవిజయులు విరోధించి ద్వారం వద్ద నిరోధించారు. సనక మహర్షి ముందువెనుక కనక (చూడక) వారిని రాక్షసులై పుట్టండని శపించాడు. ‘న క్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతిః, భవన్తి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే’- పుణ్యమూర్తులు, పవిత్రాత్ములైన పురుషోత్తమ భక్తులకు పాపమూలకాలైన కోపతాపాలు, మద మాత్సర్య లోభాలు ఉండవు. ఎంచగ సనత్కుమారులను మించిన సాత్తిక భక్తులు ఎవరున్నారు? అయినా, సనకుడు కినుక (కోపం) పూనాడంటే అది అనంగ జనకుని (విష్ణువు) అంతరంగ లీలా సంకల్పంగానే భావించాలి. తనవారు (ద్వారపాలురు) చేసిన తప్పునకు తానే బాధ్యత వహిస్తూ, జయ-విజయులు ఘోరమైన మూడు దానవ జన్మలెత్తితే వారిని తరింపజేయడానికి దానవారి హరి చత్వారి (నాలుగు) జన్మలు వరించాడు. వాటిలో మొదటి రెండూ (వరాహ, నారసింహ) ఘోరతర జన్మలు. శాపమిచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తంగా సనకుడు కూడా పశ్చాత్తాపం చెంది కనికరంతో వారి వెనుకనే అవని (భూమి) మీద అసురకులంలో అవతరించి వారు తరించడానికి పరోక్షంగా పాలుపంచుకున్నాడు. తొలిజన్మలో ప్రహ్లాదుడు కాగా మలిజన్మలో విభీషణుడు. శిశుపాల దంతవక్తృలుగా మూడో జన్మలో శాపవిముక్తితో కథకు ముగింపే కాన సనకునికి మరోజన్మతో పనిలేకుండా పోయింది. ఈ విషయాన్ని వంశీధరుడు తన భాగవత ‘భావార్థ దీపికా’ వ్యాఖ్యలో ఉల్లేఖించాడు.
ఆ॥ సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి
యసురరాజ తనయునందు నిలిచి
పాసి చనవు విష్ణుఁబాయని విధమున
నేడు దగిలి యుండు నిర్మలాత్మ!
సప్తమ స్కంధం సుగుణమణి గణ గరిష్ఠుడైన ప్రహ్లాద మహాభాగవతునికి సంపూర్ణంగా సమర్పితమైన స్కంధం. ‘ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవత స్మరామి’- ప్రసిద్ధమైన ఈ శ్లోకంలో పుణ్యమూర్తులు, సిద్ధపురుషులైన పరమ భాగవతుల స్మరణం సాధక భక్తలోకానికి అరణంగా అనుగ్రహింపబడింది. ఇందులో మునుముందుగా అసురర్షి- అసురులలో రుషివంటి ప్రహ్లాదుని పేర్కొనడం విశేషం. ఆది అంతాలలో ఇద్దరు అసురుల- ప్రహ్లాద విభీషణుల స్మరణ! వీరిద్దరి మధ్య పన్నిద్దరు (12) మహా భాగవతుల సన్నిధానం! వింతగా లేదూ? లోక విరుద్ధమైనా ఇది శుద్ధం. వీరుభయులూ అసురలోకంలో ఆవిర్భవించినా ‘రహితా సరోసురః’- అసురుల స్వభావం ఏ మాత్రం లేని వారు. ఇది నారదుని వంటి సాధు సంతుల అనుగ్రహం. ధర్మజుని రాజసూయ యాగ సందర్భంగా దేవర్షి నారదుడు తన ప్రియశిష్యుడైన ప్రహ్లాదుని చరిత్రను సభాముఖంగా ప్రస్తుతించాడు. గురువుగారితో బరువైన ప్రశంసలు పొందిన శిష్యుని జన్మ ధన్యం. ప్రహ్లాదుని ప్రసక్తి వచ్చినప్పుడల్లా పోతరాజు పరవశించిపోయి పూతరేకుల వంటి మధుర గీతాలతో శాంతగుణ ప్రధానుడైన ఆ భాగవత శిరోమణిని అశ్రాంతంగా కీర్తించాడు. నారద ఉవాచ..
‘పవిత్రాత్మా! పాండవాగ్రజా! ధర మీది నదులన్నీ కడలివైపుగా కదలి-వెడలి దానిని చేరి మరి వదలిపోనట్లు, లోకంలోని సద్గుణాలన్నీ సమూహాలుగా వచ్చి ప్రీతితో ప్రహ్లాదుని పొంది, భక్తులకు పరమగతి అయిన మహావిష్ణుని వదలిపోలేని మహా భాగవతుల వలె, అతణ్ని విడిచి వెళ్లలేక నేటికీ నిలిచి ఉన్నాయి.’
కం॥ గుణనిధి యగు ప్రహ్లాదుని
గుణములనేకములు గలవు గురుకాలమునన్
గణుతింప నశక్యంబులు
ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్
‘మహారాజా! ప్రహ్లాదుడు తమకు ప్రతిపక్షమైన రాక్షస కులంలో పుట్టాడని ఏ మాత్రం కక్షబూని ద్వేషించక విబుధవరులు- దేవతాశ్రేష్ఠులు కూడా వారి-వారి సభలలో ‘ప్రహ్లాదుని వంటి సాధుగుణ భూషణుని, సత్య భాషణుని, బుధజన విధేయుని- విద్వాంసుల పట్ల వినయపూర్ణుని, మేమెక్కడా కనలేద’ని సత్కవుల వలె చవులూరించే పలు విధాల పద్యాలలో ఘనంగా అతనిని పొగడుతూ ఉంటారు. అలాంటిది, మహీనాథా! మీవంటి మహా భాగవతులు ప్రహ్లాదుని హెచ్చుగా మెచ్చుకోకుండా ఉండగలరా?’ ఇలా ఎవణ్ని పగవారు సైతం వగవక పడి-పడి తెగ పొగడుతూ ఉంటాడో వాడే మహాత్ముడు. ప్రహ్లాదుని వంటి భక్తుల చరిత్రలు వినడం వల్ల మనసు పవిత్రమై మాధవుని యందు భక్తి వర్ధిల్లుతుంది.
‘ధర్మనందనా! ప్రహ్లాదుడు సుగుణాలకు పెన్నిధి. అవన్నీ గణించాలంటే ఎంత సమయమూ సరిపోదు. ఆ గుణాలన్నీ వర్ణించి చెప్పాలంటే వందలాది నాలుకలు కల ఆ ఆదిశేషునికి, ఇంద్రాది దేవతలకు ఆచార్యుడైన బృహస్పతికి, భాషా యోష (స్త్రీ) భారతీదేవికి భర్త అయిన నాలుగు మోముల నలువ- బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు.’ ‘గుణైరలమసంఖ్యేయైః..’ (అసంఖ్యాకమైన గుణాలచే)- సంస్కృతంలో ఇంతమాత్రమే ఉన్న చిన్నమాటను పెంచి మరపురాని కందపద్యంగా రూపొందించి సాహిత్య, భాషాప్రియులందరికీ వందనీయడు అయ్యాడు ‘శారదా నందనుడు’ పోతన.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Read More :
పోతన భాగవతం | ప్రజ్ఞానమే ప్రహ్లాదం
పోతన భాగవతం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!
పోతన భాగవతం | వైరులూ హరి వారలే!
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి
పోతన భాగవతం | భద్రమైన గురుబోధ
పోతన భాగవతం | పరివర్తన చెందడానికే!