కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషేకం వైభవంగా జరిగింది. కొన్నాళ్లు గడిచాయి. యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం, సోదర నష్టం ధర్మరాజును పీడించసాగింది. మనసు మనసులో లేకుండాపోయింది. పాలనపై దృష్టి సారించలేకపోయాడు. సోదరులతో తృప్తిగా మాట్లాడలేకపోయాడు. తన కొలువులోని పండితులతో విచారిస్తే.. తీర్థయాత్రలు చేసిరమ్మని సలహా ఇచ్చారు. సకుటుంబ సపరివారంగా తీర్థయాత్రలకు వెళ్లాలని నిశ్చయించుకుంటాడు ధర్మరాజు. సమీప బంధువులనూ తమతోపాటు యాత్రలకు రావాల్సిందిగా కోరతాడు.
స్వయంగా తానే ద్వారక వెళ్లి తమతో యాత్రలకు రమ్మని కృష్ణుడిని ఆహ్వానిస్తాడు ధర్మరాజు. పాలనా వ్యవహారాల్లో తీరికలేదని, రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు చిన్నబుచ్చుకుంటాడు. యాత్రలు చేసే అవకాశం అరుదుగా గానీ రాదనీ, తీర్థస్నానం కన్నా మించిన పుణ్యం మరొకటి లేదని కృష్ణుడికి నచ్చజెప్ప చూస్తాడు. ధర్మరాజు ఆంతర్యం గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక ఆనపకాయను తెచ్చి ధర్మరాజు చేతిలో ఉంచుతాడు. ‘నేను రాకపోయినా నా ప్రతినిధిగా దీన్ని యాత్రకు తీసుకువెళ్లమ’ని చెప్తాడు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు తీసుకొని యాత్రలకు బయల్దేరుతాడు ధర్మరాజు.
కొన్నాళ్లకు యాత్రలు ముగించుకొని వచ్చిన ధర్మరాజు మళ్లీ ద్వారకకు వెళ్తాడు. తనతోపాటు ఆనపకాయనూ వెంట తీసుకెళ్తాడు. శ్రీకృష్ణుడిని దర్శించుకొని ‘నీ ప్రతినిధిగా ఈ ఆనపకాయను మాతోపాటు సమస్త తీర్థరాజాల్లోనూ మునక వేయించామ’ని చెబుతూ దాన్ని ఆయనకు అప్పగిస్తాడు. యాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఫలానా రోజు అందరికి సమారాధన నిర్వహిస్తున్నట్టు, దీనికైనా తప్పక హాజరుకావాలని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఆనపకాయ తిరిగి ధర్మరాజుకు ఇచ్చి సమారాధనలో వంటల్లోకి దానిని ఉపయోగించమని చెప్తాడు కృష్ణుడు.
సమారాధన రోజు రానే వచ్చింది. కృష్ణబలరాములు సహా చాలామంది ప్రముఖులు ధర్మరాజు ఇంటికి వచ్చారు. అందరూ పంక్తిలో కూర్చున్నారు. తృప్తిగా తింటున్నారు. కాసేపయ్యాక అందరిదీ ఒకే మాట ‘చేదు చేదు!’. ‘ఆనపకాయ చేదుగా ఉంది’ అన్నారు. శ్రీకృష్ణుడి వంక చూశాడు ధర్మరాజు. చేదుగానే ఉందన్నట్టుగా తలూపాడు శ్రీకృష్ణుడు. ఎలాగైతేనేం భోజనాలు పూర్తయ్యాయి. శయన మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు ధర్మరాజు. ‘ఆనపకాయ చేదుగా లేకపోతే బాగుండును!’ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘చేదు తీగకు పుట్టిన తీగ చేదుగా లేకపోతే తీపిగా ఉంటుందా?’ అన్నాడు. ‘అయితే, ఆనపకాయ చేదుగా ఉంటుందని తెలిసి మరీ సమారాధనకు ఎందుకు వండమన్నావు?’ అన్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు తాపీగా ‘నీతోపాటు సమస్త నదీనదాల్లో మునకకేయడం వల్ల దానిలోని చేదుతనం పోయి తీపిగా మారి ఉంటుందనుకున్నాను బావా!’ అన్నాడు. అప్పుడు గానీ ధర్మరాజుకు విషయం బోధపడలేదు. నల్లనయ్య తనకు ఏం చెప్పదలిచాడో తెలుసుకున్నాడు.
ఆధ్యాత్మిక సాధనలో తీర్థయాత్రలు ముఖ్యమైనవి. కానీ, చాలామంది యాత్రలకు వెళ్తే ఎక్కడలేని పుణ్యం వచ్చేస్తుందని, నదిలో మునిగితే సకల పాపాలూ తొలగిపోతాయని భావిస్తుంటారు. పాపాల పరిహారం కోసమే తీర్థయాత్రలకు వెళ్తుంటారు. తీర్థయాత్ర మానసిక పరివర్తనకు భూమిక కావాలి. నదీస్నానం శరీరానికే కాదు మనసుకు పట్టిన మాలిన్యాలనూ తొలగించాలి. నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయన్న పెద్దల మాటను కొట్టిపారేయడానికి వీల్లేదు. మన పూర్వులు మనిషి మంచికోరి చెప్పిన మాటిది. మానవుడు సహజంగా కొన్ని పాపాలు చేస్తుంటాడు. తెలియక చేసేవి కొన్నయితే, కొందరు తెలిసి మరీ పాపాలు మూటగట్టుకుంటారు. ఇలాంటివారిలో పరివర్తన తీసుకురావడానికి తీర్థస్నానం ఒక అవకాశం. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది, అటుపై ఎలాంటి పాపాలు చేయకుండా ఉంటానని సంకల్పించుకోవాలి. అప్పుడే తీర్థయాత్రలు, నదీస్నానాల పరమార్థం పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఎన్ని యాత్రలు చేసినా, ఎన్నెన్ని తీర్థాల్లో మునిగినా మానసికంగా కాస్తయినా మారకపోతే అవన్నీ వర్థం!