X Down | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) మళ్లీ మొరాయిస్తున్నది. సాయంత్రం 5గంటల భారత్‌లో ‘ఎక్స్’ పని చేయడం లేదు. డిజిటల్ ప్లాట్ఫాట్స్ ట్రాకర్ వెబ్సైట్ అయిన డౌన్‌డెటెక్టర్‌లో వేలాది మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. తమ అకౌంట్స్‌ని యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ రిపోర్ట్ చేశారు. ‘ఎక్స్’ యాప్‌తో పాటు వెబ్సైట్లో లాగిన్ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. పలువురు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ సందేశం వస్తున్నట్లుగా తెలిపారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ ‘ఎక్స్’ని యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ యూజర్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఎక్స్ పని చేయడం లేదని సమాచారం. అయితే, ఎక్స్ పని చేయకపోవడానికి క్లౌడ్‌ఫ్లేర్‌లోని సాంకేతిక సమస్య కారణంగా సమాచారం.
అయితే, దీనిపై ఇప్పటి వరకు ‘ఎక్స్’ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. పలువురు యూజర్లు ఇతర సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌తో పాటు పలువురు వెబ్‌సైట్స్ సైతం పని చేయడం లేదని పేర్కొన్నారు. క్లౌడ్‌ఫ్లేర్‌లోని హోస్ట్ సర్వర్ డౌన్ అయ్యిందని ఓ యూజర్ తెలిపాడు. అదే సమయంలో వేలాది మంది డౌన్ డిటెక్టర్లోనూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. ఈ సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా భారీగా కనిపిస్తున్నది. ఎక్స్ మొబైల్ యాప్ నుంచి 61 శాతం మంది ఫిర్యాదు చేయగా.. వెబ్సైట్ పని చేయడం లేదని 28శాతం, సర్వర్ కనెక్షన్ లోపాలు తలెత్తినట్లుగా 11శాతంగా మంది ఫిర్యాదు చేసినట్లుగా డేటా పేర్కొంది. అయితే, దీనిపై క్లౌడ్‌ఫ్లేర్ స్పందించింది. క్లౌడ్‌ఫ్లేర్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని.. సమస్యను గురించి వేగంగా పరిష్కరిస్తామని పేర్కొంది. అయితే, గత కొంతకాలంగా ఎక్స్ మొరాయిస్తూ వస్తున్నది. తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో యూజర్లు ఇబ్బందిపడుతున్నారు.