ఆయన పేరు మహ్మద్ రిజ్వాన్ (పేరు మార్చాం).. జగిత్యాల పోలీస్ శాఖలో ఏఎస్ఐ.. డిగ్రీ చదివిన ఆయన, దాదాపు నలభై ఏండ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అంకితభావంతో పనిచేశాడు. ఆయన ఉద్యోగంలో చేరిన సమయంలో జగిత్యాల జిల్లా అంతటా నక్సలైట్ల ప్రభావంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా.. ప్రభుత్వ ఆదేశాలతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోనూ యాక్టివ్‌గా పనిచేశాడు. హెడ్ కానిస్టేబుల్‌గా, ఆపైన ఏఎస్ఐగా ప్రమోషన్లు పొందాడు. ఐదేండ్ల క్రితం ఎస్ఐగా ప్రమోషన్ కల్పించేందుకు పోలీస్ శాఖ హైదరాబాద్‌లో మూడు నెలలపాటు ఇచ్చిన శిక్షణ తీసుకున్నాడు. తర్వాత నిర్వహించిన పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. పదవీ విరమణకు దగ్గరగా వచ్చిన సమయంలోనైనా పదోన్నతి వస్తున్నదని సంబురపడ్డాడు. నెలలు, సంవత్సరాలు గడిచినా ప్రమోషన్ రాకపోవడంతో నిరాశ చెందాడు. రిటైర్మెంట్ సమీపిస్తుండడంతో ఆందోళనకు గురయ్యాడు. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం పదవీ విరమణ వయసును మూడేండ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో కాస్తా కుదుట పడ్డాడు. కానీ, అన్ని జిల్లాల నుంచి శిక్షణ పొందిన హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ప్రమోషన్లు ఇచ్చినా.. జగిత్యాల జిల్లా నుంచి శిక్షణ పొందిన వారికి ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నాడు. వచ్చే నెల చివరలో రిటైర్మెంట్ ఉండడంతో మానసికంగా కుంగిపోయాడు. ఒక్క రిజ్వానే కాదు, జగిత్యాల జిల్లాలో మరో నలుగురు ఇలానే ఆవేదన చెందుతున్నారు. ఎస్ఐగా రిటైర్ అవుతామని తాము ఆశపడితే పదోన్నతి పొందకుండానే రిటైర్ పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
జగిత్యాల, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : శాంతిభద్రతలే లక్ష్యంగా నాడు కేసీఆర్ సర్కారు పోలీస్‌శాఖ బలోపేతానికి కృషి చేసింది. అందులో భాగంగా నియామకాలు చేపట్టడంతోపాటు పదోన్నతులు కల్పించింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 359 మంది హెడ్ కానిస్టేబుల్/ఏఎస్ఐలకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్లుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 359 మంది హెడ్ కానిస్టేబుళ్లను, ఏఎస్ఐలను రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శిక్షణకు హజరు కావాలని సూచించింది. అప్పుడు 359 మంది మూడు నెలలపాటు శిక్షణ పొందారు. తర్వాత పరీక్ష నిర్వహించి, పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు.
ఎస్ఐ పోస్టులు సైతం జోన్ పోస్టులుగా గుర్తించిన విషయం విదితమే. అయితే పూర్వ జోన్ల స్థానంలో కొత్త జోన్లను అమలులోకి తేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల జిల్లా బాసర జోన్ పరిధిలోకి వెళ్లింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లోకి, పెద్దపల్లి కాళేశ్వరం జోన్లోకి వెళ్లాయి. బాసర జోన్ పరిధిలో జగిత్యాలతోపాటు నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు చేరాయి. దీంతో ఏఎస్ఐ పోస్టులకు సంబంధించిన సీనియార్టీని లెక్కించడం సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తూ, ఎస్ఐగా పదోన్నతి కోసం శిక్షణ పొందిన వారికి మినహా మిగిలిన అన్ని జిలాల్లకు చెందిన వారికి ప్రమోషన్లు విడుతల వారీగా దక్కాయి. కానీ, ఐదేళ్లు గడిచినా జగిత్యాల జిల్లా నుంచి శిక్షణ పొందిన వారికి మాత్రం పదోన్నతి లభించలేదు. 2025 ఫిబ్రవరిలో పోలీస్ శాఖ పదోన్నతుల కోసం మరోసారి హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు శిక్షణను ఇచ్చింది. ఈ శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి ఇద్దరు ఏఎస్ఐలు, కరీంనగర్ జిల్లా నుంచి ఏడుగురు హాజరయ్యారు. 2025లో శిక్షణ పొందిన కరీంనగర్‌కు చెందిన ఏడుగురు ఏఎస్ఐలకు ఇప్పటికే పదోన్నతి లభించగా, జగిత్యాల నుంచి శిక్షణ పొందిన ఇద్దరికి పదోన్నతి లభించలేదు. 2021లో జగిత్యాల నుంచి శిక్షణ పొందిన 10 మంది ఏఎస్ఐలకు ఇంత వరకు ప్రమోషన్లు లభించలేదు. 2025లో శిక్షణ పొందిన ఇద్దరికి కూడా ప్రమోషన్లు రాలేదు. వారితో పాటు శిక్షణ పొందిన మిగిలిన అందరికీ పదోన్నతి లభించింది.
రిటైర్ అయ్యేసరికైనా తాము సబ్ ఇన్స్పెక్టర్లం అవుతామో లేదోనని శిక్షణ పొంది పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఏఎస్ఐలు వాపోతున్నారు. చావునోట్లో తలబెట్టి నలభై ఏండ్ల పోలీస్‌శాఖలో కొనసాగామని, నాడు ఎక్కడ మందుపాతర పేలుతుందో.. ఎక్కడ కాల్పులు జరుగుతాయో.. మరు నిమిషం ప్రాణాలతో ఉంటామో లేదో తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించామని గుర్తు చేస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత ఎస్ఐగా ప్రమోషన్ కల్పిస్తామని శిక్షణ ఇచ్చి, ఒక్క జగిత్యాల జిల్లాకు మాత్రమే మొండిచేయి చూపడం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. 2021లో శిక్షణ పొందిన పది మందిలో ఏడుగురు పదోన్నతి పొందకుండానే రిటైర్ అయ్యారని, మరో ఏడాది అయితే తాము కూడా రిటైర్ అవుతామని చెబుతున్నారు. 2025 బ్యాచ్ చెందిన ఇతర జిల్లాల వారికి పదోన్నతి ఇచ్చి, తమకెందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం కాలేదని వాపోతున్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఉన్నతాధికారులను కలిసినా సాకులు చెబుతున్నారే తప్ప తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జగిత్యాల జిల్లా ఏఎస్ఐలకు న్యాయం చేయాలని, త్వరగా పదోన్నతి కల్పించాలని వేడుకుంటున్నారు.