– అభివృద్ధికి అడ్డుపడితే మిత్రభేదం తప్పదు
– కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
అనంతగిరి, ఆగస్టు 10 : ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఒకే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాయని, పేదల పక్షాన పోరాడే ప్రతి వ్యక్తి సిపిఐ కార్యకర్త అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమ సన్నహానికై మార్పు కావాలి పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్ర సోమవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు సిపిఐ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను బిజెపి ప్రభుత్వం మోసగించిందన్నారు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. పేదలు ఇబ్బందులు పడుతున్నంతకాలం మావోయిజం అణిచి వేయబడదని అన్నారు. నీటి పరీక్షల్లో లీకేజీ పై విద్యార్థులు కొట్టిన దెబ్బ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా తగిలింది అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడే సమయం వచ్చిందన్నారు. కార్పొరేట్ శక్తులకు కేంద్రం కొమ్ము కాస్తు పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.
రాష్ట్రాల మిత్రపక్షమైన కాంగ్రెస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. ఇతర పార్టీల మద్దతు సర్పంచులు ఉన్న చోట అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీతో కూడా విభేదించేందుకు సిద్ధమని అన్నారు. పథకాల అమలుపై నిధులు లేకపోతే నిజాలు ఒప్పుకోవాలని అమలు చేయలేమన్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వానికి సూచించారు. కాలయాపన చేస్తూ ప్రజల మభ్య పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సర్పంచులకు అభివృద్ధి నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, బత్తినేని హనుమంతరావు, మేకల శ్రీను తంబాల శ్రీను, గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ సైదులు, మండల కార్యదర్శి యరసాని రవికుమార్, జిల్లా యూత్ కార్యదర్శి డేగ వీరన్న, సర్పంచ్ వాడకోప్పుల ఉమా, ఉప సర్పంచ్ స్వాతి, మండల సహాయ కార్యదర్శి లాలు, మండల కౌన్సిల్ సభ్యులు, గ్రామ శాఖ సభ్యులు, సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు.