హనుమకొండ, సెప్టెంబర్ 21: ప్రపంచ వారసత్వ సంపదగా యునెసో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, పరిసర పర్యావరణం, వ్యవసాయం, భూగర్భ జలాలకు ముప్పు కలిగించే అవకాశమున్న వెంకటాపూర్ పీవీ నరసింహారావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ డిమాండ్ చేసింది. గనిపై నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర శాస్త్రీయ, పర్యావరణ, భూగర్భ జలాలు, భౌగోళిక, వారసత్వ ప్రభావ అధ్యయనాలు నిర్వహించాలని కోరింది. హనుమకొండ ప్రగతినగర్‌లోని కార్యాలయంలో సోమవారం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి గ్రేటర్ వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ తకళ్లపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపుర్‌లో గని ప్రతిపాదనను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అత్యంత సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. రామప్ప దేవాలయం 2021లో (యునెస్కో)ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిందని, యునెస్కో వివరాల ప్రకారం ఆలయం తన నిర్మాణ వారసత్వంతోపాటు రామప్ప చెరువు, నీటి పారుదల వ్యవస్థలు, కొండలు, అడవులు, వ్యవసాయ భూములతో కూడిన విస్తృత సహజ పరిసరాలతో అంతర్భాగంగా ఉన్న వారసత్వ ప్రదేశం అని ఆయన పేరొన్నారు. అందువల్ల రామప్ప దేవాలయాన్ని కేవలం ఒక నిర్మాణంగా కాకుండా, దాని చుట్టూ ఉన్న సహజ, జల, భౌగోళిక, సాంసృతిక పరిసరాలతో కలిపి పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగే పరిస్థితిని శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉందని సమావేశం నిర్ణయించింది. ఈ ప్రాంతం ప్రాణహిత-గోదావరి గ్రాబెన్ భౌగోళిక నిర్మాణ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రాంతం కావడంతో, లోతైన తవ్వకాల వల్ల స్థానిక భూగర్భ జల ప్రవాహాలు, భూగర్భ పగుళ్లు, ఎలైన్మెంట్లు, నీటి మట్టాలపై ఎలాంటి ప్రభావం ఏర్పడుతుందో ముందుగానే అధ్యయనం చేయాలని సమావేశం సూచించింది. రామప్ప చెరువు నీటి మట్టం, పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జల ప్రవాహాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నిపుణులు సూచించారు.
లోతైన ఓపెన్ కాస్ట్ గని పిట్ ఏర్పడటం వల్ల చెరువు, గని ప్రాంతం మధ్య హైడ్రాలిక్ గ్రేడియంట్లో మార్పులు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల భూగర్భ జలాల ప్రవాహ దిశలు, నీటి ఊటలు ప్రభావితమయ్యే అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రత్యేకంగా, రామప్ప చెరువు కట్ట నిర్మాణం, దాని పునాది, భూగర్భ పగుళ్లు, ఎలైన్మెంట్లు, సీపేజ్ మార్గాలు, ప్రతిపాదిత గని పిట్ మధ్య సంబంధాన్ని హైడ్రోజియాలజీ, జియోటెక్నికల్, జియోఫిజికల్ అధ్యయనాల ద్వారా పరిశీలించాలని కోరారు. చెరువు కట్ట రెండు కొండలను అనుసంధానించే నిర్మాణంగా ఉండటం, కట్టలోని నీటి స్రావ నియంత్రణ వ్యవస్థలు, కట్ఆఫ్ ట్రెంచ్ తదితర అంశాలపై కూడా నిపుణుల సమీక్ష అవసరమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
300 మీటర్ల లోతైన తవ్వకాల వల్ల భూగర్భ జలాల ప్రవాహంలో గణనీయమైన మార్పులు ఏర్పడితే, పరస్పరం అనుసంధానమైన భూగర్భ పగుళ్లు, లైన్మెంట్ల వెంట నీటి ప్రవాహం, సీపేజ్ పెరిగే అవకాశం ఉందా అనే అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా పైపింగ్ ఫినామినన్, కట్టలోని సీపేజ్, భూగర్భ జలాల స్థాయి, చెరువు నీటి మట్టం, గని పిట్ మధ్య హైడ్రాలిక్ సంబంధాలను మోడలింగ్ ద్వారా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ అంశాలపై తుది నిర్ణయానికి ముందుగా స్వతంత్ర నిపుణుల బృందంతో సమగ్ర అధ్యయనం చేయాలని సమావేశం కోరింది.
ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, భారీ యంత్రాల వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే ప్రకంపనలు రామప్ప దేవాలయ నిర్మాణ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయాలని సమావేశం పేరొంది. ఇటీవల జిల్లా స్థాయిలో కూడా ప్రతిపాదిత గనిపై నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర శాస్త్రీయ, పర్యావరణ, భద్రతా అధ్యయనాలు అవసరమని అధికారులు పేరొన్నట్టు వార్తా నివేదికలు వెల్లడించాయి. అందువల్ల రామప్ప ప్రపంచ వారసత్వ ప్రదేశం, రామప్ప చెరువు, పరిసర గ్రామాలు, ప్రజల జీవనోపాధిపై ప్రభావాన్ని అంచనా వేసే వరకు మైనింగ్‌కు సంబంధించిన తదుపరి చర్యలను ముందుకు తీసుకెళ్లకూడదని సమావేశంలో పాల్గొన్నవారు కోరారు.
ప్రొఫెసర్ ఎం పాండురంగారావు ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల సంభవించే భౌగోళిక, జల, పర్యావరణ, వారసత్వ ప్రభావాలను శాస్త్రీయ సమాచారం ఆధారంగా వివరించారు. వెంకటాపూర్, పరిసర గ్రామాల ప్రజలకు మైనింగ్ వల్ల కలిగే సాధ్యమైన ప్రభావాలపై శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నిర్ణయించింది.
భవిష్యత్తులో ఇంజినీర్లు, భూగర్భ శాస్త్రవేత్తలు, హైడ్రోజియాలజిస్టులు, న్యాయవాదులు, వైద్యులు, రైతులు, యువత, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు, అటవీరంగ ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో మరిన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. రామప్ప ప్రపంచ వారసత్వ సంపదను, రామప్ప చెరువును, పరిసర పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజల్లో విసృ్తత అవగాహన కల్పిస్తూ, అవసరమైన అన్ని ప్రజాస్వామ్యం, చట్టబద్ధ మార్గాల్లో కార్యక్రమాలను కొనసాగిస్తామని సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు.
1. వెంకటాపూర్ పీవీ నరసింహారావు ఓపెన్ కాస్ట్ గని ప్రతిపాదనపై సమగ్ర పునఃపరిశీలన చేయాలి.
2. రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, పరిసర ప్రాంతాలపై స్వతంత్ర హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించాలి.
3. సమగ్ర హైడ్రోజియలాజికల్, గ్రౌండ్‌వాటర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి.
4. జియోటెక్నికల్, జియో ఫిజికల్ స్టడీస్ నిర్వహించాలి.
5. 300 మీటర్ల లోతైన తవ్వకాల వల్ల ఏర్పడే హైడ్రాలిక్ గ్రేడియంట్ మార్పులను శాస్త్రీయంగా మోడలింగ్ చేయాలి.
6. రామప్ప చెరువు కట్ట భద్రత, సీపేజ్, పైపింగ్ ప్రమాదాలను నిపుణులతో
పరిశీలించాలి.
7. బ్లాస్టింగ్ వల్ల రామప్ప దేవాలయంపై కలిగే వైబ్రేషన్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలి.
8. మైనింగ్‌కు ముందు, మైనింగ్ సమయంలో రామప్ప దేవాలయం, చెరువు, భూగర్భ జలాలు, భూకంప/వైబ్రేషన్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
9. స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు,
వారసత్వ నిపుణుల అభిప్రాయాలను నిర్ణయ ప్రక్రియలో పరిగణనలోకి
తీసుకోవాలి.
10. రామప్ప ప్రపంచ వారసత్వ సంపద పరిరక్షణకు ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రీయంగా నిర్ధారించే వరకు గనికి సంబంధించిన తదుపరి చర్యలను నిలిపివేయాలి. రామప్పను కాపాడటం అంటే ఒక దేవాలయాన్ని మాత్రమే కాపాడటం కాదు … కాకతీయుల వారసత్వం, రామప్ప చెరువు, ప్రకృతి పరిసరాలు, భూగర్భ జల వ్యవస్థలు, భవిష్యత్ తరాల సాంసృతిక సంపదను కాపాడటం. ఈ సమావేశంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అధ్యక్షుడు ఖాజీపేట పురుషోత్తం, మీడియా ఇన్చార్జి మండల పరశురాములు, ఎండీ రెహమాన్, జనవిజ్ఞాన వేదిక ప్రొఫెసర్ లక్ష్మిరెడ్డి, ధర్మప్రకాష్, ప్రొఫెసర్ శ్రీనివాసాచార్యులు, సోహంరెడ్డి, శుభంరెడ్డి, కే ఓంకార్, వాటర్‌మ్యాన్ వీ ప్రకాష్, రామ్మోహన్రావు, జే శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.