పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వాళ్లకే శత్రువు అయ్యాడు. సొంత జిల్లా రైతులు నీళ్ల కోసం అరిగోస పడుతుంటే చిల్లర రాజకీయాలు చేస్తున్నడు. వరద జలాలను ఏపీ సర్కార్ తీసుకెళ్తుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వం.. జూరాలలో నీళ్లున్నా విడుదల చేయకపోవడం దారుణం. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఎకరా ఎండిన సర్కార్‌దే బాధ్యత. తీరు మారకపోతే ఇక ఉద్యమమే.
– కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): జూరాల రిజర్వాయర్‌లో నీళ్లున్నా పంటలకు విడుదల చేయకపోవడం దారుణమని, ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరం పంట ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వరద జలాలపై కట్టిన ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ నీళ్లు తీసుకెళ్తుంటే, ఇక్కడ నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల కింద రైతాంగానికి నీరందించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఎల్ నినో కంటే ఎల్ కాంగ్రెస్‌తోనే రాష్ర్టానికి ఈ దుస్థితి దాపురించిందని దెప్పిపొడిచారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన 248 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ కేవలం 28 టీఎంసీలే వాడుకోవడం సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకొనే రేవంత్‌రెడ్డి.. పాలమూరు రైతులకు మొదటి శత్రువు అయ్యారని నిప్పులు చెరిగారు. సొంత జిల్లా రైతులు నీళ్ల కోసం అరిగోస పడుతుంటే చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. అన్నదాతల విషయంలో రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే ఉద్యమిస్తామని, ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధిస్తామని తేల్చిచెప్పారు.
అక్రమ అరెస్ట్‌లకు బీఆర్ఎస్ భయపడబోదని కేటీఆర్ స్పష్టంచేశారు. నీళ్ల కోసం ఆందోళనకు దిగిన జూరాల ఆయకట్టు రైతాంగానికి సంఘీభావంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని నిప్పులుచెరిగారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్, కాళేశ్వరంలోని కన్నెపల్లి మోటర్లను ఆన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి 10 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి పంటలు కాపాడాలని కోరారు.
భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ భూముల వద్దకు కాంగ్రెస్ నాయకులు వెళ్లి డ్రామాలు చేయడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని తాము చేసిన సవాల్‌కు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
పంటలు కాపాడుకోవాలనే తపనతో జూరాల గేట్లు ఎత్తేందుకు యత్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోసపెడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎకడికకడ బారికేడ్లు పెట్టి.. వందలాది పోలీసులను మోహరించడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తాగునీటికి కేవలం 2 టీఎంసీలు సరిపోతాయని తెలిసినా చుకనీరు విడుదల చేయకుండా ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపమన్నారు. అక్రమం గా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సరార్ కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టు సిరిసిల్లలో 8వేల ఎకరాలు కబ్జా చేసిన వారి వివరాలు బయటపెట్టాలని, లేదంటే తప్పుడు ఆరోపణలు చేశానని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్లకు వెళ్తానంటున్న సీఎం అక్కడికి వెళ్లి ప్రజలకు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. నేతన్నల ఆత్మహత్యల గురించా? లేక ఎగ్గొట్టిన రైతుబంధు గురించి చెప్తారా? అని నిలదీశారు. సిరిసిల్లలో చేసిన అభివృద్ధిని చూసి కొడంగల్‌లో అమలు చేసేందుకు వస్తున్నట్టున్నారని చురకలంటించారు. అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్నను దర్శించుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలని హితవు పలికారు.