Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో 15వ రోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. వీకెండ్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే హౌస్‌లో మరోసారి నామినేషన్స్ వేడి మొదలైంది. సుధీర్, సృష్టి మధ్య మాటల యుద్ధం, వంశీ-వర్షిణి-దేబ్జానీల మధ్య వాగ్వాదం, చరణ్-ఝాన్సీ మధ్య జరిగిన గొడవతో ఎపిసోడ్ మొత్తం హాట్ హాట్‌గా సాగింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా ముగియకుండానే ఎపిసోడ్‌ను ఆపేశారు. మిగిలిన నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలో సృష్టి, త్రిగున్తో సుధీర్ గురించి మాట్లాడిన సన్నివేశాలను చూపించారు. మరోవైపు సుధీర్, వర్షిణి కూడా మాట్లాడుకోవడం కనిపించింది. హౌస్‌లో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, గతంలో జరిగిన విషయాలపై చర్చ జరిగింది. అదే సమయంలో సుధీర్-సృష్టి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా హౌస్‌లో చర్చ మొదలైంది. ఈ అంశం తర్వాత నామినేషన్స్ సమయంలో పెద్ద గొడవకు దారితీసింది.
అనంతరం ముకేశ్‌ను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అతనికి ‘టెంప్టేషన్స్ అండ్ టెన్షన్స్’ కార్డును అందించారు. ఇందులో భాగంగా ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందే అవకాశం ముకేశ్‌కు ఇచ్చారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ అతనికి మరో ఆసక్తికరమైన ఎంపికను కూడా ఇచ్చారు. ఝాన్సీకి ఉన్న ఇమ్యూనిటీని తీసుకోవాలా? లేక ఝాన్సీని కెప్టెన్ పదవి నుంచి తొలగించి ఆ అవకాశాన్ని త్రిగున్‌కు ఇవ్వాలా? అనే రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ముకేశ్ మాత్రం ఝాన్సీ ఇమ్యూనిటీని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం బయటకు వచ్చి ఈ విషయాన్ని ఝాన్సీతో పంచుకున్నాడు. తన నిర్ణయం సరైనదేనని ఝాన్సీ కూడా అంగీకరించింది. ముకేశ్‌కు లభించిన ఈ ప్రత్యేక అవకాశం కారణంగా అతను ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ ఓ ఎన్వలప్ గేమ్ ద్వారా నామినేషన్స్‌లో పాల్గొనే అవకాశం ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించారు. మొదట ముకేశ్‌ను ఎవరిని ఎంపిక చేస్తారని అడగగా.. రామ్ ప్రసాద్, చరణ్ పేర్లను చెప్పాడు. అయితే చివరికి రామ్ ప్రసాద్ మాత్రమే నామినేషన్స్‌కు అర్హత సాధించాడు. రామ్ ప్రసాద్‌కు వచ్చిన ఎన్వలప్లో రెండు నామినేషన్స్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఒక నామినేషన్ తాను చేసి, మరో నామినేషన్ చేసే అవకాశాన్ని ఇంకొక హౌస్‌మేట్‌కు ఇవ్వొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రామ్ ప్రసాద్ తనకు వచ్చిన రెండు అవకాశాల్లో ఒకదాన్ని ఉపయోగించి వంశీని నామినేట్ చేశాడు. ఆహారం విషయంలో వంశీ ఎక్కువగా అరుస్తున్నాడనే కారణాన్ని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఈ అంశంపై వంశీ, వర్షిణి, దేబ్జానీల మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
తనకు వచ్చిన మరో నామినేషన్ అవకాశాన్ని రామ్ ప్రసాద్ రోహిత్‌కు ఇచ్చాడు. రోహిత్‌ను చెక్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ అవకాశం ఇచ్చానని రామ్ ప్రసాద్ చెప్పాడు. దీంతో రోహిత్ సుధీర్‌ను నామినేట్ చేశాడు. వర్షిణి సుధీర్‌ను కంట్రోల్ చేస్తోందని, గతంలో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ రోహిత్ తన నామినేషన్ కారణాలను చెప్పాడు. ఈ క్రమంలో సృష్టి పేరు కూడా చర్చలోకి రావడంతో సుధీర్, సృష్టి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సృష్టి సుధీర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తన క్యారెక్టర్‌ను సుధీర్ తప్పుగా చూపిస్తున్నాడని, తానే అతని వెంట తిరిగినట్లు మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది.
ఇదే సమయంలో సుధీర్, త్రిగున్ పేరును ప్రస్తావించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఆ తర్వాత అమన్, సుధీర్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. తర్వాత వర్షిణికి నామినేషన్ చేసే అవకాశం వచ్చింది. ఇద్దరిని నామినేట్ చేయాల్సిన పరిస్థితిలో ఆమె సుధీర్, షాలిని పేర్లను ఎంచుకుంది. అనంతరం సుధీర్‌కు అవకాశం రావడంతో అమన్‌ను నామినేట్ చేశాడు. తర్వాత చరణ్‌కు రెండు నామినేషన్ల అవకాశాలు వచ్చాయి. అందులో ఒక అవకాశాన్ని దేబ్జానీకి ఇచ్చాడు. చరణ్ తన నామినేషన్లో ఝాన్సీని ఎంపిక చేశాడు. ఝాన్సీని నామినేట్ చేస్తూ చరణ్ కొన్ని కారణాలను చెప్పాడు. ముఖ్యంగా ‘రైతు బిడ్డ’ అనే విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించుకోవద్దని, షర్ట్, టవల్ వంటి అంశాల విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాడు. దీనిపై ఝాన్సీ తీవ్రంగా స్పందించింది. తాను రైతు బిడ్డనేనని, ఆ విషయాన్ని చెప్పుకోవడం తన ఇష్టమని స్పష్టం చేసింది. దీంతో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది.
మరోవైపు దేబ్జానీ తనకు వచ్చిన అవకాశంతో త్రిగున్‌ను నామినేట్ చేసింది. కాఫీ దొంగతనం చేశాడనే కారణాన్ని ఆమె ప్రస్తావించింది. ఈ అంశం కూడా హౌస్‌లో చర్చకు దారితీసింది. ఎపిసోడ్ చివర్లో చరణ్, అమన్‌తో మాట్లాడుతూ ముకేశ్‌కు లభించిన ‘స్టార్ ప్లేయర్’ గుర్తింపుపై ప్రశ్నలు లేవనెత్తాడు. ముకేశ్‌కు నలుగురు మాత్రమే ఓటు వేసినప్పుడు అతనికి స్టార్ ప్లేయర్ గుర్తింపు ఎలా వచ్చిందని చరణ్ ప్రశ్నించాడు.హౌస్‌లో మొత్తం 14 మంది ఉన్న సమయంలో కేవలం నలుగురి ఓట్లతో ముకేశ్‌ను ‘బెస్ట్ ప్లేయర్’గా ఎలా ఎంపిక చేశారనే విషయంపై తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ముకేశ్‌కు లభించిన ఈ గుర్తింపుపై హౌస్‌లో మరో చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.