– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్ రెడ్డి
మాడుగులపల్లి, ఆగస్టు 10 : నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వరద కాల్వ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి వల్ల పరిస్థితి అత్యంత అద్వానంగా తయారైందని, పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారూ రైతుల ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి. యాగాలు చేసినంత మాత్రాన కాలవల్లోకి నీళ్లు రావు, లిఫ్ట్ మోటార్లు ఆన్ చేస్తేనే నీళ్లు వస్తాయి అని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో మోటార్లు స్టార్ట్ చేసి, వరద కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని పారించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. నీటిని వెంటనే విడుదల చేయకపోతే రైతుల తరఫున బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.